ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం జరిగే సమావేశంలో ఒమిరాన్‌కు ఔషధం, చికిత్స విధానం రూపొందించడంపై నిపుణుల అభిప్రాయాలు, సలహాలను తీసుకోనున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాత రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్‌లో 2 కోవిడ్ కేసులు కనుగొన్నట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. న్యూఢిల్లీ నుంచి తిరిగి వస్తుండగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మీడియాతో బొమ్మై మాట్లాడుతూ.. ఈ కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలని, ఇప్పటికే అధికారులను ఆదేశించామని, వెరియంట్ కు కారణమైన వ్యక్తి కాంటాక్ట్స్ గుర్తించి, సమావేశంలో చర్చిస్తామన్నారు. కాగా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కర్నాటకలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ డబుల్ డోస్ సర్టిఫికెట్ ఉంటేనే కాలేజీలు, మాల్స్, సినిమా థియేటర్లలోకి అనుమతి ఇస్తున్నారు. ఆర్‌టీ పీసీఆర్ రిపోర్ట్ ఉంటేనే విమానాశ్రయాల్లోకి ఎంట్రీ కల్పిస్తున్నారు.
భారత్‌లోనూ రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని ఇద్దరు వ్యక్తుల్లో కొత్త వేరియంట్ బయటపడగా.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించిన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. అయితే, ఒమిక్రాన్ సోకిన 46ఏళ్ల వ్యక్తి ఒక వైద్యుడని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని అధికారులు తెలిపారు. గత నెల 21న జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో ఆరోజు ఉదయం 10గంటల సమయంలో ఆర్‌టి- పిసిఆర్ పరీక్ష చేయించుకున్నారు. ఆ మరుసటి రోజు సాయంత్రం 4గంటలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. సిటి వాల్యూ తగ్గుతున్నట్లు గమనించి అతడి శాంపిల్స్‌ని జీనోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపారు.