Site icon HashtagU Telugu

Forbes List : ఫోర్బ్స్ జాబితాలో గిరిజ‌న ఆశా కార్య‌క‌ర్త

Forbes

Forbes

ఆమె ఓ మారుమూల గిరిజ‌న గ్రామానికి చెందిన సాధార‌ణ మ‌హిళ‌..సెల‌బ్రిటీ కాదు…రాజ‌కీయ నాయ‌కురాలు అంత‌క‌న్నా కాదు.. కేవ‌లం 5వేల రూపాయ‌లకు ప‌ని చేసే ఆశా వ‌ర్క‌ర్‌. చిన్న జీతానికి ఇంత‌గా క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె ఎప్పుడూ భావించ‌లేదు.అందుకే క‌రోనా స‌మ‌యంలో ఆమె చేసిన సేవ‌కు ఫ‌లితంగా ఆమె ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యు-పవర్ 2021 జాబితాలో నిలిచింది.

ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలోని బరాగావ్ తహసీల్‌లోని గర్గద్‌బహల్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల మటిల్డా కులు అనే గిరిజ‌న మహిళ గత 15 సంవత్సరాల నుండి సామాజిక ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్నారు. ఈమెను ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆశా దీదీ అని కూడా పిలుస్తారు. కోవిడ్-19కి సంబంధించిన చికిత్సలు, ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించడంలో మటిల్డా కులు ముఖ్యపాత్ర పోషించారు.ఈమె చేసిన సేవ‌కు గుర్తింపు ల‌భించింది. మ‌టిల్డా కులు ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యూ-పవర్ 2021 జాబితాలో చోటు దక్కించుకున్నారు. మటిల్డా కులు తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇందులో 21 మంది మహిళలు ఉన్నారు.

నెలకు రూ. 4,500 సంపాదిస్తున్న మటిల్డా కులు బరాగావ్ తహసీల్‌లోని 964 మంది ప్రజల సంరక్షణకు తన జీవితాన్ని అంకితం చేశారని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. మటిల్డా కులు ప్ర‌తి రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచి తన ఇంటి పనులను పూర్తి చేస్తుంది. తన నలుగురు కుటుంబ సభ్యులకు ఆహారం సిద్ధం చేసి… ఇంటి వద్ద నాలుగు పశువులను మేపుతుంది

మటిల్డా కులు ఆశా వర్కర్‌గా ఉద్యోగంలలో చేరిన‌ప్పుడు గ్రామస్థులు అనారోగ్యం పాలైన తర్వాత వైద్యుడిని సంప్రదించడానికి బదులు తాంత్రికుడి సందర్శించడం ఆమె గమనించింది. వీరికి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల తాంత్రికుడి సంప్ర‌దిస్తున్నార‌ని భావించిన ఆమె జ‌బ్బులు న‌యం కావ‌డానికి మందులు, చికిత్స‌ల‌పై వారికి అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో ఆమె కీల‌క పాత్ర పోషించింది. గ్రామస్తులు ఇప్పుడు తాంత్రికుడిని సందర్శించడానికి బదులుగా చికిత్స కోసం వైద్యుడిని సంప్రదిస్తున్నారు.

ప్రతిరోజూ మటిల్డ కులు సైకిల్‌పై గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల నుండి ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని తెలుసుకుంటారు. దీంతో పాటు నవజాత, కిశోర బాలికలకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం, ప్రినేటల్‌ చెక్‌అప్‌, ప్రసవానికి సిద్ధం చేయడం, గర్భిణులకు పౌష్టికాహారం తదితర అంశాలపై గ్రామస్థులకు సలహాలు ఇస్తారు. అర్ధరాత్రి కూడా ప్రసవ నొప్పిని అనుభవించే మహిళలకు మందులు ఇస్తారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో మటిల్డా కులు కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేశారు. కోవిడ్ -19 పరీక్షలను నిర్వహించడానికి ఆమె ప్రతిరోజూ 50-60 ఇళ్లను సందర్శించేది. వృద్ధ మహిళలు, పురుషులను టీకాలు వేసేందుకు టీకా కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.త‌న‌కు ప్రాధాన్యత లభించినందుకు చాలా సంతోషంగా ఉన్నానని మ‌టిల్డా కులు తెలిపింది. ఆశా వర్కర్ గా తాను చేసిన దానికి గర్వపడుతున్నానని ..త‌న కృషి చాలా మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడిందని అన్నారు.

Exit mobile version