Night Curfew: ఆ రెండు రోజులు నైట్ క‌ర్ఫ్యూ.. ?

కర్నాటకలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఎనిమిది ఓమిక్రాన్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే వీటిని నియంత్రించేందుకు బృహ‌త్ బెంగుళూరు పాలికే(బీబీఎంపీ) ప్ర‌య‌త్నిస్తుంది.

  • Written By:
  • Publish Date - December 21, 2021 / 09:24 AM IST

కర్నాటకలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఎనిమిది ఓమిక్రాన్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే వీటిని నియంత్రించేందుకు బృహ‌త్ బెంగుళూరు పాలికే(బీబీఎంపీ) ప్ర‌య‌త్నిస్తుంది. క్రిస్మ‌స్‌, న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లు ప్ర‌జ‌లు గూమిగూడి వేడుకలు చేసే అవ‌కాశం ఉండ‌టంతో దానిని నియంత్రించాల‌ని బీబీఎంపీ చూస్తోంది. ఓమిక్రాన్ వైర‌స్ వ్యాప్తి నియంత్రణకు తీసుకున్న చర్యలపై బీబీఎంపీ చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా మీడియాకు తెలిపారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రద్దీని నియంత్రించాల్సిన అవసరం ఉందని.. అయితే దీనిపై ప్రభుత్వానికి ఇంకా సమాచారం ఇవ్వలేదన్నారు. రాష్ట్రం నియమించిన సాంకేతిక సలహా కమిటీ సలహా మేరకు ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.

ఓమిక్రాన్ వ్యాప్తిలో ప్రపంచ వృద్ధి ఆధారంగా మేము ఇక్కడ పరిస్థితిని కూడా చూస్తున్నామని.. చాలా మంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని ఆయ‌న తెలిపారు. బీబీఎంపీలో 40,000 పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామ‌ని..వచ్చే వారికి RTPCR పరీక్షను తప్పనిసరి చేసామన్నారు. విదేశాల నుండి వ‌చ్చే వ్యక్తులలో కోవిడ్ నిర్ధారణ అయితే .. ఆ న‌మూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతామ‌ని ఆయ‌న తెలిపారు.పాజిటివ్ వ‌చ్చిన‌ వారు తప్పనిసరిగా ఎనిమిది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల‌ని తెలిపారు.

క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు గుమిగూడకుండా నిరోధించాల్సిన అవసరాన్ని తాము చ‌ర్చించామ‌ని బీబీఎంపీ స్పెష‌ల్ కమిషనర్ (హెల్త్‌) డాక్టర్ కెవి త్రిలోకచంద్ర తెలిపారు. దీనిపై శనివారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. న్యూఇయర్ కి నాలుగు రోజుల ముందు న‌గ‌రంలో నైట్ కర్ఫ్యూను విధించేలా నిబంధనలను రూపొందించాలని సీనియర్ పోలీసు అధికారులు బీబీఎంపీ అధికారులను కోరారు. డిసెంబర్ 30 లేదా 31 తేదీల్లో అకస్మాత్తుగా రాత్రిపూట కర్ఫ్యూ నిబంధనలను జారీ చేస్తే ప్రజలను నియంత్రించడం కష్టమ‌ని..అందుకే నాలుగు రోజుల ముందుగానే అమలు చేస్తే పరిస్థితిని అదుపు చేయడం సులువవుతుందని సూచించారు. అయితే దీనిపై సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై డిసెంబ‌ర్ 16 న మాట్లాడుతూ ఒక వారం రోజుల పాటు పరిస్థితిని గమనించి, ఆపై ఒక నిర్ణయానికి రావాలని అనుకుంటున్నామ‌ని తెలిపారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోదలుచుకోలేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.