Kerala: కేరళలో కొత్త వైరస్.. ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

కేరళలో కొత్త వైరస్ బయటపడడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

  • Written By:
  • Updated On - June 6, 2022 / 02:07 PM IST

కేరళలో కొత్త వైరస్ బయటపడడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. తిరువనంతపురంలోని విజింజంలో ఇద్దరు చిన్నారుల్లో నోరో వైరస్ ను గుర్తించనట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి టెన్షన్ పడక్కరలేదని.. పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జ్. కాకపోతే ప్రజలు మాత్రం ఈ వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నోరో వైరస్ సోకిన ఇద్దరు చిన్నారులు ఎల్ఎంఎస్ఎల్పీ స్కూల్ లో చదువుతున్నారు. ఆ స్కూల్లో ఫుడ్ పాయిజన్, డయేరియాతో పిల్లలు బాధపడుతున్నారని తెలిసిన వెంటనే ప్రభుత్వం వారికి ఆరోగ్య పరీక్షలు చేసింది. వారి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించడంతో ఇద్దరు చిన్నారులకు నోరో వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. స్కూల్లో మధ్యాహ్న భోజనం తరువాత పిల్లలు అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది.

నోరో వైరస్ అంటువ్యాధి కావడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది కలుషిత ఆహారం, కలుషితమైన నీటితో ఎక్కువగా వ్యాపిస్తుంది. నోరో వైరస్ ఉన్న ప్రదేశాలను తాకినా, ఆ వైరస్ ఉన్న వస్తువులను తాకినా.. లేదా ఆ వైరస్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినా.. నోరో వైరస్ వచ్చే ప్రమాదముంది. ఈ వైరస్ అటాక్ చేస్తే.. విరేచనాలు, వాంతులతోపాటు ఒళ్లు నొప్పులు, తలనొప్పి వేధిస్తాయి. అందుకే తాగునీటితోపాటు చుట్టుపక్కల ఉండే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నారు అధికారులు. కేరళలో కిందటి ఏడాది కూడా నోరో వైరస్ కేసులు వెలుగుచూశాయి. వాయనాడ్ లోని వెటర్నరీ కాలేజ్ లో 13 మంది దీని బారిన పడ్డారు. అప్పుడు ప్రభుత్వం వెనువెంటనే చర్యలు చేపట్టడంతో అదుపులోకి వచ్చినా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. లావెట్రీకి వెళ్లి వచ్చిన తరువాత కచ్చితంగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. లేదంటే వైరస్ సోకే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
============