New Pamban Bridge : తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం పట్టణం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవికి వెళ్లాలంటే సముద్ర మార్గం మాత్రమే ఉంది. ఈ రెండు ప్రాంతాలను సముద్ర మార్గంలో లింక్ చేసేలా పాంబన్ రైల్వే వంతెన రెడీ అయింది. అవసరాన్ని బట్టి నిలువునా పైకి లేపే వసతి కలిగిన ఫ్లెక్సిబుల్ వంతెన ఇది. మన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ వంతెన ఇది. దీన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పాంబన్ వంతెన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Most Used Platform : సైబర్ క్రైమ్స్‌కు ఎక్కువగా వాడుతున్నది ఆ యాప్‌నే.. కేంద్రం నివేదిక
పాంబన్ వంతెన గురించి..
- పాంబన్ వంతెన పనులకు 2019 మార్చి 1న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.
- 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) ఈ వంతెన పనులు మొదలుపెట్టి.. నాలుగేళ్లలోనే పూర్తిచేసింది.
- ఈ వంతెన నిర్మాణంలో ఎక్కడా 1 మిల్లీమీటరు తేడా కూడా రాకుండా రైల్వేశాఖ జాగ్రత్తలు తీసుకుంది.
- ఈ వంతెనపై 600 మీటర్ల పరిధిలో భారీ సైజు వర్టికల్ లిఫ్ట్(New Pamban Bridge) ఉంది. దాని ఏర్పాటు పనులు పూర్తి కావడానికే 5 నెలల టైం పట్టింది.
- వర్టికల్ లిఫ్ట్ బరువు 660 టన్నులు. దీని పొడవు 72.5 మీటర్లు.
- పాంబన్ వంతెన సముద్రంలో 2.08 కి.మీ పొడవునా విస్తరించి ఉంటుంది. దీని దిగువ నుంచి ఓడలు రాకపోకలు సాగించొచ్చు.
- ఈ వంతెెనకు రెండు వైపులా నిలువు స్తంభాలు ఉంటాయి. వాటికి 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతూ ఉంటాయి. రెండు దూలాల బరువు 625 టన్నులు.
- పాంబన్ వంతెనపై ఉండే వర్టికల్ లిఫ్ట్‌లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్‌లు కంట్రోల్ చేస్తాయి.
- ఈ వంతెనను ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్ట్‌లు, మోటార్ల సాయంతో అవలీలగా పైకి వస్తుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇదంతా ఈజీగా జరిగిపోతుంది.
- పాంబన్ వంతెనకు సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకూ 25-35 మీటర్ల లోతున పునాదులు వేశారు. కొన్నిచోట్ల భారీ రాళ్లు రాగా, నేరుగా వాటిలోకి బలమైన కాంక్రీట్‌ను చొప్పించారు.
- ప్రపంచంలోనే రెండో అతి ఎక్కువ తుప్పు పట్టే ప్రాంతంగా పాంబన్ తీరానికి పేరుంది.
- సముద్రపు కెరటాలు పాంబన్ వంతెనపైకీ వస్తుంటాయి. పాత పాంబన్ వంతెనకు చెందిన ఇనుము తుప్పుపట్టి, మందం మొత్తం కరిగిపోయింది.
- పాంబన్ కొత్త వంతెనకు తుప్పు సమస్య రాకుండా దాని నిర్మాణాలపై 3 పొరలుగా పాలీసిలోక్సేన్ పెయింటింగ్ వేశారు. దీని కారణంగా రాబోయే 58 ఏళ్ల వరకు ఈ వంతెనకు తుప్పుతో సమస్య ఉండదు. చిన్నచిన్న మరమ్మతులు చేస్తే వందేళ్ల దాకా ఎలాంటి ఢోకా ఉండదు.
- సముద్రంలోని దిమ్మెలు పాడు కాకుండా .. వాటి చుట్టూ కేసింగ్ విధానంలో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేశారు.
- వర్టికల్ లిఫ్ట్ వంతెనలో కనీసం ఒక్క బోల్టును కూడా వాడలేదు. కేవలం వెల్డింగ్‌తోనే దాన్ని జోడించారు.
- వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేశారు. గంటకు 58 కి.మీ వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్సర్లు ఆటోమేటిక్‌గా ఈ వంతెన మార్గాన్ని మూసేస్తాయి.
- మత్స్యకారుల పడవలు, బార్జ్ పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెల పైనున్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు.