Netanyahu Vs Unnithan : గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరుపుతున్న భీకర దాడుల్లో ఇప్పటివరకు 12వేల మందికిపైగా సామాన్య పాలస్తీనా పౌరులు చనిపోయారు. చనిపోయిన వారిలో దాదాపు సగం మంది పిల్లలే అని తెలుస్తోంది. ఈనేపథ్యంలో పాలస్తీనాకు ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఇజ్రాయెల్ అరాచకంపై అంతటా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈనేపథ్యంలో కేరళలోని కాసరగోడ్‌లో జరిగిన పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నిథాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధ నేరస్థుడు. అతడిని విచారించకుండానే కాల్చి చంపాలి’’ అని ఆయన కామెంట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే యుద్ధ నేరాలకు పాల్పడే వారిని న్యూరేమ్‌బెర్గ్ ట్రయల్స్ పేరుతో విచారించేవారు. న్యూరేమ్‌బెర్గ్ ట్రయల్స్ జాబితాలో ఉండే యుద్ధ నేరస్థులను ఎలాంటి విచారణ లేకుండానే కాల్చి చంపేవారు. మళ్లీ న్యూరేమ్‌బెర్గ్ మోడల్ ట్రయల్ నిర్వహించాల్సిన సమయం వచ్చింది. బెంజమిన్ నెతన్యాహు యుద్ధ నేరస్థుడిగా ప్రపంచం ముందు నిలిచాడు. విచారణ లేకుండానే నెతన్యాహును కాల్చి చంపడానికి ఇది సరైన సమయం. ఎందుకంటే అతడు చేస్తున్న క్రూరత్వం ఆ స్థాయిలో ఉంది’’ అని రాజ్‌మోహన్ ఉన్నిథాన్ కామెంట్ చేశారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా నవంబర్ 23న కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) కోజికోడ్ బీచ్‌లో ర్యాలీ నిర్వహించనుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ కార్యక్రమాన్ని(Netanyahu Vs Unnithan) ప్రారంభిస్తారు.