600 Diamonds Crown : స్వామివారిపై ముస్లిం డ్యాన్సర్ భక్తి.. 600 వజ్రాలతో కిరీటం

600 వజ్రాలతో కూడిన రూబీ కిరీటం విశేషాలను చూస్తే.. దాని బరువు 3,169 క్యారెట్లు(600 Diamonds Crown).

Published By: HashtagU Telugu Desk
Muslim Bharatanatyam Artist Zakir Hussain 600 Diamonds Crown Trichy Temple Tamil Nadu

600 Diamonds Crown : తమిళనాడుకు చెందిన ముస్లిం భరతనాట్యం డ్యాన్సర్ జాకిర్ హుస్సేన్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆయన ఒక ముస్లిం అయినప్పటికీ.. హిందూ మతంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రత్యేకించి తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగం రంగనాథర్ స్వామి అంటే ఆయనకు ఎంతో భక్తి. ఆ భక్తిభావంతోనే తాజాగా ఆయన శ్రీరంగం రంగనాథర్ స్వామి ఆలయానికి ఒక అపురూపమైన కానుకను అందించారు.  600 చిన్నచిన్న వజ్రాలతో అలంకరించిన రూబీ కిరీటాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన జాకిర్ హుస్సేన్.. దాన్ని  స్వామివారికి కానుకగా అందించారు. స్వయంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కిరీటాన్ని అందజేశారు. మన దేశంలో పూర్తిస్థాయిలో రూబీతో తయారు చేయించిన తొలి దేవతా కిరీటం ఇదేనని జాకిర్ హుస్సేన్ చెప్పారు. ‘‘మీరు ముస్లిం కదా ?’’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన ఇలా బదులిచ్చారు. ‘‘నేను ముస్లింనే ఔను.. నేను అంతకంటే ముందు ఇక ఇండియన్‌ను. నాకు రంగనాథర్ స్వామి అంటే ఇష్టం. అందుకే ఆయనకు ఈ కానుకను అందించాను’’ అని జాకిర్ హుస్సేన్ బదులిచ్చారు.

Also Read :Sai Pallavi Vs Vegetarian : ‘‘నేను మాంసాహారం మానేశానా ?’’.. లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా: సాయిపల్లవి

600 వజ్రాలతో కూడిన రూబీ కిరీటం విశేషాలను చూస్తే.. దాని బరువు 3,169 క్యారెట్లు(600 Diamonds Crown). దీన్ని పూర్తిగా ఒకే రూబీ రాయితో తయారు చేయించారు. బంగారం పచ్చలతో ఈ కిరీటాన్ని అందంగా అలంకరించారు. దాదాపు గత 200 ఏళ్లలో రంగనాథర్ స్వామికి ఇలాంటి కిరీటాన్ని ఎవరూ సమర్పించలేదని జాకిర్ హుస్సేన్ తెలిపారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు శ్రమించి గోపాల్ దాస్ అనే కళాకారుడు ఈ కిరీటాన్ని రూపొందించాడన్నారు. ‘‘ఈ కిరీటం కోసం వాడిన అరుదైన రూబీని రాజస్థాన్‌లో గుర్తించారు. ఈ తరహా రూబీని వెతకడానికే మాకు దాదాపు మూడేళ్ల టైం పట్టింది. రూబీని నేను తీసుకెళ్లి శిల్పుల టీమ్‌కు అప్పగించాను. కిరీటం తయారు చేసే క్రమంలో రూబీ పగిలితే మాకు సంబంధం లేదు అని వాళ్లు చెప్పారు. అయినా నేను రిస్క్ తీసుకున్నాను. పర్లేదు ఖర్చును భరిస్తాను అని చెప్పాను. నేను రిస్క్ తీసుకున్నందుకు అంతా బాగానే జరిగింది’’ అని జాకిర్ హుస్సేన్ వివరించారు. తన భరతనాట్యం ప్రదర్శనల నుంచి వచ్చిన డబ్బులతోనే ఈ కిరీటాన్ని తయారు చేయించినట్లు తెలిపారు. అయితే కిరీటం ధరను వెల్లడించడానికి జాకిర్ నిరాకరించారు.

  Last Updated: 12 Dec 2024, 01:08 PM IST