Polavaram Project : రాష్ట్ర జీవన రేఖగా పరిగణించబడే పోలవరం ప్రాజెక్టుకు తిరిగి మంచి రోజులు వచ్చాయి. ప్రాజెక్టు పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా సమీక్ష నిర్వహించడం విశేషంగా మారింది. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్న ఈ సమీక్షకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఒడిశా సీఎం మోహన్ మాజీ, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఆయా రాష్ట్రాల జలవనరుల మంత్రులు, ముఖ్య అధికారులు హాజరవుతారు. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కు ఇప్పటికే పంపింది.
జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు – నిర్మాణ బాధ్యత రాష్ట్రానికే
రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. నీతి ఆయోగ్ సిఫారసు మేరకు నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించగా, కేంద్ర జలశక్తి శాఖ కూడా అనుకూలంగా స్పందించింది. 2014 నుండి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లింది. ప్రతి సోమవారం “పోలవరంగా” రివ్యూలు నిర్వహిస్తూ ప్రధాన డ్యాం పనులను 72% వరకు పూర్తి చేయించారు. డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తై, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం వేసే దశకు వచ్చింది.
జగన్ పాలనలో స్థంభించిన పురోగతి
2019 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, పోలవరం పనులు అప్రాధాన్యతకు గురయ్యాయి. అప్పటి దాకా కొనసాగుతున్న కాంట్రాక్టును రద్దు చేయడంతో, సుమారు ఒక సంవత్సరం పాటు పనులు నిలిచిపోయాయి. 2020లో గోదావరిలో వచ్చిన భారీ వరదలతో డయాఫ్రం వాల్ దెబ్బతినడం మూలంగా ప్రధాన డ్యాం పనులు పూర్తిగా ఆగిపోయాయి.
చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడంతో జోరు
2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాజెక్టుకు జీవం వచ్చింది. అమెరికా, కెనడా నిపుణుల సూచనల మేరకు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంతో పాటు ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు కూడా ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సమీక్ష జరుపుతుండటం కీలక ఘట్టంగా మారింది.
ముంపు అంశంపై స్పందనకు ఆసక్తి
ఈ సమీక్షలో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ముంపు సమస్య పై ఏవైనా అభ్యంతరాలు లేవనెత్తతాయా? ఒకవేళ లేవనెత్తితే వాటిపై ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో సయోధ్యకు ప్రధాని పాలుపంచుకుంటారన్న ఆశాభావం రాష్ట్ర జలవనరుల శాఖలో ఉంది.