Site icon HashtagU Telugu

Coolie to IAS: కూలీ నెంబ‌ర్ వ‌న్‌.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీస‌ర్‌

Whatsapp Image 2022 01 09 At 20.35.26 (1) Imresizer

Whatsapp Image 2022 01 09 At 20.35.26 (1) Imresizer

కేవలం ఒక సిమ్ కార్డు, స్మార్ట్ ఫోన్, రైల్వేస్టేషన్లో దొరికే ఫ్రీ వైఫై సహాయంతో కేరళ సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన కె. శ్రీనాథ్ సివిల్స్ ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. నేటి పోటీ ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రు వాళ్లు సాధించాల‌నే దాని కోసం ఎంతో శ్ర‌మిస్తుంటారు. అదేవిధంగా సివిల్ సర్వెంట్ కావాలని కలలు కన్న కేరళకు చెందిన రైల్వే కూలీ కె. శ్రీనాథ్ తన కలను నెరవేర్చుకోవడమే కాకుండా యూపీఎస్సీ పరీక్షలో హాజరయ్యేందుకు ఎదురుచూస్తున్న ఎందరో ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అతని విజయగాథ చాలా ముఖ్యమైనది ఎందుకంటే అతను తన కృషి, అంకితభావంతో సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించడమే కాకుండా… ఎలాంటి పుస్త‌కాలు, కోచింగ్ సెంట‌ర్ ల‌కు వెళ్ల‌కుండా సివిల్స్ లో ర్యాంక్ కొట్టాడు. ఐఏఎస్ సాధించిన కె.శ్రీనాథ్ విజ‌యం వెనుక ఉన్న క‌థ న‌మ్మ‌శ‌క్యం కానిది. కేరళలోని ఎర్నాకులంలో కూలీగా పనిచేస్తున్న శ్రీనాథ్ మున్నార్‌కు చెందిన వ్యక్తి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇతను రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సామాను, బ్యాగులను మోసుకెళ్లే కూలీగా పనిచేసేవాడు. ఆయన కుటుంబానికి ఏకైక జీవనాధారం ఇదే.

27 సంవత్సరాల వయస్సులో అంటే 2018లో తన ఆదాయం తన కుటుంబానికి సరిపోదని అతను గ్రహించాడు. ముఖ్యంగా అప్పటికి ఏడాది వయసున్న కూతురు ఉండడంతో భవిష్యత్తు ఖర్చులు, పొదుపు గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది. తక్కువ సంపాదనతో తన చిన్న కూతురు జీవితంలో కష్టాలు పడాలని అనుకోలేదు. అందువల్ల అతను రాత్రిపూట కూడా సంపాదించడం ప్రారంభించాడు. అయినప్పటికీ అతను కేవలం రోజుకు రూ. 400-500 రూపాయలు మాత్ర‌మే వ‌చ్చేవి.

ఇలా ప‌ని చేస్తు ఉండ‌గా శ్రీనాథ్ కి ఒకరోజు సివిల్ సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆలోచన వచ్చింది. కానీ ఆయ‌న కుటుంబం ఆర్థిక ప‌రిస్థితి అంతంత‌మాత్రాన ఉన్నందున కోచింగ్ సెంట‌ర్ల‌కు వెళ్లి చ‌దువుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో అప్పుడు శ్రీనాథ్ తన సెల్ ఫోన్‌పై ఆధారపడగలిగాడు. జనవరి 2016లో ప్రభుత్వం ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై సేవను అందించింది. దీన్ని శ్రీనాథ్ అవ‌కాశంగా మ‌లుచుకున్నాడు. ఈ వైఫై ద్వారా నెట్ ఉప‌యోగించి త‌న ద‌గ్గ‌ర ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా చ‌దువుకునే వాడు.

శ్రీనాథ్ యూపీఎస్సీ ప‌రీక్ష‌ల్లో విజ‌యం నాలుగో ప్ర‌య‌త్నంలో సాధించాడు. మూడు ప్ర‌య‌త్నాల్లో విజ‌యం సాధించ‌న‌ప్ప‌టికీ అతను ఎప్పుడూ దానిని విడిచిపెట్ట‌లేదు. అయితే ఓ వైపు త‌న సివిల్స్ క‌ల నేర‌వేర్చుకోవాల‌నే త‌ప‌న ఉంది. కానీ కుటుంబానికి జీవ‌నాధారం తాను ప‌ని చేసే కూలీ ప‌నే కాబట్ట తన ఉద్యోగాన్ని విడిచిపెట్టే అవకాశం లేదు. అందుకే రెండు పనులు ఏకకాలంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఫ‌లితంగా నాలుగో ప్ర‌య‌త్నంలో ఐఏఎస్ సాధించాడు. ఈ విధంగానే నాటి రైల్వే కూలీ.. నేటి ఐఏఎస్ శ్రీనాథ్ ఎంతో మంది విద్యార్థులకు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ప్రతి కష్టానికి ఎప్పుడో ఒకప్పుడు ప్రతిఫలం వస్తుందనేది శ్రీనాథ్ నిరూపించాడు.

Exit mobile version