‘‘కాలేజీకి వెళ్తున్న అమ్మాయిపై ఆకతాయిల దాడి.. పోకిరీల వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య.. తాగిన మైకంలో భార్యను చితకబాదిన భర్త’’.. ప్రతిరోజూ న్యూస్ పేపర్ లో ఇలాంటి వార్త ఏదైనా ఒకటి కనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే చాలామంది ఆ వార్తలను చదివి ‘అయ్యోపాపం’ అని వదిలేస్తారు. కానీ కేరళకు 78 ఏళ్ల మీనాక్ష్మీ అలా కాదు. అమ్మాయిలు, మహిళలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అని ఆలోచిస్తోంది. దాడులను తిప్పికొట్టేందుకు ప్రాచీన యుద్ధకళ అయిన కలరిపయట్టు నేర్పిస్తూ మహిళలను బలవంతుల్ని చేస్తోంది. ఫలితంగా వేలాది మహిళలు ఈ ప్రాచీన యుద్ధకళను నేర్చుకొని.. తమను తామూ రక్షించుకుంటున్నారు.
మీనాక్షి కి చిన్నప్పట్నుంచే ఆటలపై చెప్పలేనంత ఇష్టం. ఆ ఇష్టంతోనే ఏడేళ్ల వయసులోనే ఈ కలరిపయట్టు నేర్చుకుంది. తాను ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇతరులకూ నేర్పించేది. యుద్ధ కళ విలువను, మీనాక్షి ఇష్టాన్ని గ్రహించిన ఆమె భర్త ఓ స్కూల్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మీనాక్షి భర్త చనిపోయాడు. దీంతో ఆ స్కూల్ బాధ్యతలను మీనాక్షి తీసుకోవాల్సి వచ్చింది. అప్పట్నుంచీ.. ఇప్పటివరకు మీనాక్షి అమ్మ ఎంతోమంది మహిళలు, అమ్మాయిలకు ఈ ప్రాచీన విద్యను నేర్పిస్తూ చైతన్యవంతులను చేస్తున్నారు.
78 ఏళ్ల వయసులో కూడా ఈ విద్యను నేర్పించడం అవసరమా అని ఎవనౌపా ప్రశ్నిస్తే.. మహిళలకు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా బలంగా మారుతారు. అంతేకాదు… వాళ్ల మీద నమ్మకం కూడా పెరుగుతుంది. ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా ఏమాత్రం భయపడరు.. అని అంటారీమె. ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలంటే ఓపిక, సహనం, క్రమశిక్షణ ఉండాలి. యోగా, డాన్స్ రెండు మిక్స్ చేసి ఉంటుంది. ఆ యుద్ధకళలో కత్తులు, కటార్లు ఆయుధాలుగా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే బ్రిటీష్ పాలనలో కలరిపయట్టుపై నిషేధం విధించారు. అయితే స్వాతంత్య్రం వచ్చాక నిషేధాన్ని తొలగించినప్పటికి ఈ కళకు అంతగా ఆదరణ లభించలేదు. ఆ తర్వాత మీనాక్షి అమ్మా.. ఆమె భర్త.. ఈ ప్రాచీన యుద్ధకళకు ప్రాణం పోశారు.