Hardik Patel: హార్దిక్ పటేల్ రాజీనామాకు, చికెన్ శాండ్‌విచ్‌కు సంబంధమేంటి?

ఓవైపు చింతన్ శిబిర్ ముగిసింది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ కూడా విడుదలైంది.

  • Written By:
  • Publish Date - May 19, 2022 / 10:15 AM IST

ఓవైపు చింతన్ శిబిర్ ముగిసింది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ కూడా విడుదలైంది. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను పరిగెత్తించడం ఒక్కటే మిగిలింది. సరిగ్గా ఇదే సమయంలో ఓ మెయిన్ వికెట్ పడింది. గుజరాత్‌లో కాంగ్రెస్ బలమే హార్డిక్ పటేల్. ఉన్న ఈ ఒక్క గట్టి నేత కూడా హస్తానికి బైబై చెప్పేశారు. అయితే, హార్ధిక్ పటేల్ రాజీనామాకు చికెన్ శాండ్ విచ్‌కు ఏదో సంబంధం ఉంది. ఒక విధంగా కాంగ్రెస్ నేతల తీరును, మరీ ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చే నేతల తీరును చికెన్ శాండ్ విచ్ అనే పదంతో పోల్చారు హార్దిక్ పటేల్. కొందరు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి రావడం, గుజరాత్‌లో రాజకీయ వ్యవహారాలను పట్టించుకోకుండా, వాటి గురించి ఆలోచించకుండా.. కేవలం చికెన్ శాండ్ విచ్ సమయానికి చేతిలో పడిందా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారంటూ విమర్శించారు. నిజానికి ఇది చాలా పెద్ద కామెంటే అని చెప్పాలి.

కాంగ్రెస్‌ గుజరాత్ వింగ్‌కి పీసీసీ చీఫ్‌గా ఉన్న హార్దిక్ పటేల్‌ను అక్కడి కాంగ్రెస్ నేతలు చిన్న చూపు చూశారనేది ఈయన వాదన. ముఖ్యంగా అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ తీరుపై హార్దిక్ పటేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా కాంగ్రెస్ పార్టీలోకి మరో బలమైన పాటీదార్ నేతను తీసుకురావాలనుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇందుకోసం పాటీదార్ సామాజికవర్గ కులదేవత ఆలయానికి చెందిన ఖోడల్డమ్ ట్రస్ట్ చైర్మన్ నరేష్ పటేల్‌ను పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు చేస్తోంది. ఈ వ్యవహారంపై హార్దిక్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. పార్టీకి అండగా పాటీదార్ల తరపున తానుండగా మరో పాటీదార్ నేత ఎందుకన్నది హార్దిక్ పటేల్ ప్రశ్న.

పాటీదార్ల రిజర్వేషన్ల కోసం 2015, 2016లో పెద్ద ఉద్యమమే జరిగింది. ఆ సమయంలో కీలకంగా ఉన్నది హార్దిక్ పటేలే. ఒకానొక సమయంలో బీజేపీకి చుక్కలు చూపించారు కూడా. అందుకే, హార్దిక పటేల్‌ను పార్టీలో చేర్చుకుని పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పైగా పటేల్ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 182 అసెంబ్లీ సీట్లకు గాను.. కాంగ్రెస్ 77 సీట్లు గెలిచిందంటే అందుకు కారణం హార్దిక్ పటేల్ కష్టమే. అయినప్పటికీ, మరో పాటీదార్ నేతను పార్టీలోకి తీసుకొచ్చి, హార్దిక్ పటేల్‌కు చెక్ పెట్టాలని ప్రయత్నించారు. అందుకే, కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌ను వీడారు అంటే ఏదో ఒక పార్టీలో చేరతారనే అర్ధం. ఎన్నికలకు ఎంతో సమయం లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ అన్న ఊసే రాదు. ఇక మిగిలిన ఆప్షన్ బీజేపీలో చేరడమే. దీనికి సంకేతంగా, మోదీ విధానాలు బాగున్నాయని, ఆర్టికల్ 370 అని ఏవో కొన్ని బీజేపీ అనుకూల మాటలు మాట్లాడారు. చూడాలి.. పటేల్ ప్లాన్ ఎలా ఉంటుందో.