Site icon HashtagU Telugu

Delimitation : హిందీ నేర్చుకోవడం కంపల్సరీ కాదు – పవన్ కళ్యాణ్

Pawan Kalyan Key Statement On Hindi Language

Pawan Kalyan Key Statement On Hindi Language

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) త్రిభాషా విధానం (Three-Language Formula) గురించి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హిందీ నేర్చుకోవడం కంపల్సరీ కాదని, విద్యార్థులు తమ ఇష్టమైన భాషలను నేర్చుకోవడానికి స్వేచ్ఛ ఉండాలని ఆయన పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన తంతి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌ వంటి కీలక అంశాలపై మాట్లాడారు. ఏ రాష్ట్రంలోనైనా భాషను బలవంతంగా రుద్దడం తగదని, అయితే భిన్న భాషలు నేర్చుకోవడం అదనపు ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఏపీ, కర్ణాటకలో ఇప్పటికే త్రిభాషా విధానం అమలులో ఉందని, విద్యార్థులకు భాషా అభివృద్ధిలో ఇది ఉపయోగకరమని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ తన చిన్నతనంలో భారతీయార్ కవితలు తనకు ధైర్యం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషపై ప్రేమను కలిగి ఉంటారని, అదే సమయంలో అన్ని భాషలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ భాషల్లో విద్యా సంస్థలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన భాషను నేర్చుకోవాల్సిందని తెలిపారు. హిందీ నేర్చుకోవాలని తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఇదే విధంగా ఎవరికీ కూడా భాషా బలవంతం ఉండకూడదని అన్నారు. త్రిభాషా విధానం అనేది భాషా నేర్చుకునే అవకాశాన్ని కల్పించే విధానం మాత్రమేనని, అది హిందీని బలవంతంగా నేర్పించేదిగా చూడరాదని పవన్ స్పష్టం చేశారు.

డీలిమిటేషన్‌పై పవన్ స్పందన

డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ) విషయంపై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ఇది ముప్పు కలిగిస్తుందని చెన్నైలో జరిగిన ఒక సదస్సులో చర్చించగా, పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు. మొదటగా పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించి, ఆ తర్వాత పోరాటం చేయాలని సూచించారు. రోడ్లపై నిరసనలు తెలుపడం వల్ల ఉపయోగం ఉండదని, లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోవడం అంగీకారయోగ్యం కాదని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరుగదని తాను నమ్ముతున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఏదైనా మార్పులు రావచ్చని, బీజేపీ తమిళనాడులో పుంజుకుంటుందా అనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానమిచ్చారు.