Lalu Prasad Yadav’s grandson joins foreign military బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య యాదవ్ విదేశీ సైన్యంలో శిక్షణకు వెళ్లడం సంచలనంగా మారింది. రోహిణి ఆచార్య పెద్ద కొడుకు ఆదిత్య, సింగపూర్ సాయుధ దళాలలో రెండేళ్ల ప్రాథమిక సైనిక శిక్షణ కోసం వెళ్తున్నాడు. ఇది సింగపూర్ చట్ట ప్రకారం తప్పనిసరి అయిన నేషనల్ సర్వీస్ లో భాగం. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సింగపూర్‌లోనే స్థిరపడ్డారు. దీంతో ఆమె కొడుకు సైనిక శిక్షణ కోసం వెళ్తున్నారు.
- సైనిక శిక్షణ కోసం వెళ్తున్న లాలూ మనవడు
- సింగపూర్ మిలిటరీ ట్రైనింగ్ కోసం వెళ్తున్ ఆదిత్య
- ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన రోహిణి ఆచార్య
సాధారణంగా మన దేశంలో రాజకీయాలు, సినిమాల్లో విజయం సాధించినవారు తరతరాల తమ వారసులను కూడా అదే రంగంలోకి తీసుకురావాలని కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే చాలా భిన్నంగా ఆలోచిస్తారు. ఇప్పుడీ కోవలోకి బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు కూడా చేరారు. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య పెద్ద కొడుకు ఆదిత్య యాదవ్ సైనిక శిక్షణ కోసం వెళ్తున్నారు. అయితే అది ఇండియన్ ఆర్మీ కాదు, విదేశీ సైన్య శిక్షణ కోసం వెళ్తున్నారు. దీని గురించి రోహిణి ఆచార్య ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేయడంతో, ఇప్పుడీ వార్త సంచలనంగా మారింది. తన మనవడి పట్ల లాలూ ప్రసాద్ యాదవ్ గర్వంగా ఉన్నారని ఆమె తెలిపారు.
రోహిణి ఆచార్య తన కొడుకు గురించి చెబుతూ, “ఈ రోజు నా గుండె గర్వంతో నిండిపోయింది. 18 ఏళ్ల వయసులో ప్రీ-యూనివర్సిటీ చదువులు పూర్తి చేసుకున్న మా పెద్ద కొడుకు ఆదిత్య, రెండేళ్ల ప్రాథమిక సైనిక శిక్షణ కోసం బయలుదేరుతున్నాడు. ఆదిత్య, నువ్వు ధైర్యంగా, క్రమశిక్షణతో జీవించు. వెళ్లి నీ ప్రతిభను చూపించు. ఎల్లప్పుడూ గుర్తుంచుకో, అత్యంత కష్టమైన యుద్ధాలలోనే ఒక యోధుడు పుడతాడు. మా ఆశీస్సులు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి” అని పోస్ట్ చేశారు.
ఆమె తన పోస్ట్‌కు కామెంట్స్ సెక్షన్‌ను బ్లాక్ చేయడంతో, ఆదిత్య ఏ దేశ సైన్యంలో చేరబోతున్నాడనే దానిపై కొంత రహస్యం నెలకొంది. రోహిణి ఆచార్య తన తల్లిదండ్రులతో పాటు ఉన్న కొడుకు ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆమె తన కొడుకును ‘ధైర్యవంతుడు, సాహసోపేతుడు, క్రమశిక్షణ కలిగినవాడు’ అని అభివర్ణించారు.
ఆదిత్య ఏ దేశ సైన్యంలో శిక్షణకు వెళ్తున్నాడనే దానిపై సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. రోహిణి ఆచార్య చాలా సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి సింగపూర్‌లో నివసిస్తున్నారు. ఆ దేశ నియమాల ప్రకారం, 18 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి యువకుడు, శాశ్వత నివాసితులు తప్పనిసరిగా సైనిక సేవ చేయాలి. ఆదిత్య సింగపూర్‌లో శాశ్వత నివాసి కాబట్టి, ఆ దేశానికి సేవ చేయడం అతనికి తప్పనిసరి. అందుకే అతను ప్రాథమిక సైనిక శిక్షణ కోసం సింగపూర్ సాయుధ దళాలలో చేరాడు. ఈ శిక్షణ సాధారణంగా సుమారు రెండేళ్లు పడుతుంది మరియు ఇది చాలా కఠినంగా ఉంటుందని చెబుతారు.
ఆదిత్య ఇప్పుడు సింగపూర్ నేషనల్ సర్వీస్ (NS) లో భాగంగా బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ (BMT) మొదలుపెట్టాడు. ఇది సైన్యంలో చేరేవారికి ప్రాథమిక శిక్షణ. ఈ BMT లో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, టీమ్‌వర్క్, నాయకత్వ లక్షణాలను నేర్పిస్తారు. శిక్షణలో భాగంగా కఠినమైన వ్యాయామాలు, ఆయుధాల వాడకం, ఫీల్డ్ ట్రైనింగ్, సైనిక నీతి నియమాలు నేర్పిస్తారు.
ఈ BMT లో వారి పనితీరు ఆధారంగా, సింగపూర్ సాయుధ దళాలలో (SAF) వారికి ప్రత్యేక స్థానాలు కేటాయిస్తారు. అవి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదా సైన్యేతర పనులకు కూడా పంపవచ్చు. రెండు సంవత్సరాల పూర్తికాల సేవ తర్వాత, వారు 40, 50 ఏళ్ల వరకు రిజర్విస్ట్‌లుగా ఉండాలి. ఇది వారి ర్యాంక్, పాత్రను బట్టి ఉంటుంది. ఆదిత్య సింగపూర్ చట్ట ప్రకారం తప్పనిసరి అయిన నేషనల్ సర్వీస్ చేస్తున్నాడు. నేషనల్ సర్వీస్ అందరికీ ఒకేలా ఉంటుంది. దీన్ని తప్పించుకుంటే శిక్షలు ఉంటాయి.
