Vijay and Prashant Kishore: ప్ర‌శాంత్ కిషోర్‌తో విజ‌య్ భేటీ.. పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయ‌మా..?

  • Written By:
  • Updated On - March 17, 2022 / 11:32 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాల‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించి కార్యకలాపాలు కూడా జరుపుతున్నారు. అయితే ఆ తర్వాత విజయ్ ఒత్తిడితో ఆ పార్టీని ఉపసంహరించుకున్నా పార్టీ కార్యాలయం అలానే ఉంచి కార్యకలాపాలు నడిపిస్తున్నారు.

ఇక త‌న‌కు రాజ‌కీయాల పై పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేద‌ని విజయ్ గ‌తంలోనే తేల్చి చెప్పారు. అయితే ఇటీవ‌ల త‌మిళ‌నాడులో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో విజయ్ మక్కల్ ఇయ్యక్కం పేరుతో ఆయన అభిమానులు పోటీ చేసి సత్తా చాటారు. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడులోని పంచాయితీ, మున్సిపాలిటీల‌ల్లో కోన్ని చోట్ల విజయ్‌ మక్కల్‌ ఇయక్కంకు చెందిన అభ్యర్థులు పోటీ చేసి గెలుపొందారు. దీంతో వారందరినీ ఇంటికి పిలిపించుకున్న విజ‌య్ వారితో భేటీ అయ్యి ఫొటో దిగారు.

అయితే ఇప్పుడు మరోసారి విజయ్ రాజకీయాల్లోకి రానున్నారని తమిళ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ క్ర‌మంలో తమిళనాడు 2026 అసెంబ్లీ ఎలక్షన్స్‌ టార్గెట్ చేసుకొని రాజకీయాల్లోకి రావాలని విజ‌య్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా తాజాగా జాతీయ ఎన్నిక‌ల వ్యూహక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో విజ‌య్ ర‌హ‌స్యంగా హైద‌రాబాద్‌లో స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక ప్ర‌శాంత్ కిషోర్‌తో విజ‌య్ భేటీ నిజమేనని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. అక్క‌డ డీఎంకేకు ప్రధాన ప్రతిపక్షంగా ఏ ఒక్క పార్టీ లేదు. గ‌త ఎన్నిక‌ల నేప‌ధ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అన్నాడీఎంకేను తమిళ ప్రజలు తిరస్కరించారు. ఫలితంగా గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన స్థానికి సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా అన్నాడీఎంకే చిత్తు చిత్తుగా ఓడింది.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు రాష్ట్రంలో స‌రైన ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డంతో రాజకీయ శూన్యత నెలకొంది. ఈ క్ర‌మంలో దీన్ని భర్తీ చేసేందుకు విజయ్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నార‌ని అక్క‌డి పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి రాజ‌కీయాలే వ‌ద్ద‌నుకున్న విజ‌య్ మ‌న‌సు మార్చుకుని పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తారా లేక టీఆర్పీల కోసం త‌మిళ‌నాడు మీడియా క్రియేట్ చేసిన గాసిప్పా అనేది తెలియాలంటే, ఈ విష‌యం పై విజ‌య్ స్పందించాల్సిందే. ఏది ఏమైనా ఒక‌వేళ విజ‌య్ రాజ‌కీయ ఆరంగ్రేటం చేస్తే, త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నాలు న‌మోద‌వ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.