Site icon HashtagU Telugu

Kishtwar Cloudburst: జ‌మ్మూ కశ్మీర్‌లో పెను విషాదం నింపిన క్లౌడ్ బరస్ట్‌.. 46 మంది మృతి!

Cloudburst

Cloudburst

Kishtwar Cloudburst: జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మాచైల్ మాత యాత్రకు వచ్చిన భక్తులపై ఆకస్మికంగా కురిసిన కుంభవృష్టి (Kishtwar Cloudburst) కారణంగా సంభవించిన వరదల్లో 40 మంది మరణించారు. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా గాయపడగా, 213 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనతో పవిత్ర యాత్రను నిలిపివేశారు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతంలో సుమారు 1000 మంది యాత్రికులు ఉన్న‌ట్లు స‌మాచారం.

వరద బీభత్సం

మాచైల్ మాత మందిరం సముద్ర మట్టానికి సుమారు 2,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలోని చోసోటి అనే గ్రామం వద్ద ఈ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. యాత్రికులు తమ వాహనాలను పార్క్ చేసే ప్రాంతంలో వరద పోటెత్తడంతో భక్తులు వరదలో కొట్టుకుపోయారు. ఈ వరద బీభత్సానికి ఆలయ పరిసరాలు అతలాకుతలమయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు సీఐఎస్‌ఎఫ్‌ (CISF) జవాన్లు కూడా ఉన్నారని సమాచారం.

Also Read: Sanju Samson: సంజూ శాంస‌న్ సీఎస్కే జ‌ట్టులోకి వెళ్ల‌టం క‌ష్ట‌మేనా?

సహాయక చర్యలు

ఘటన గురించి తెలిసిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. సైనిక దళాలు కూడా ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. వందల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలోని వాతావరణం, దెబ్బతిన్న రోడ్ల కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి.

ఈ విషాదంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా రేపు జరగబోయే స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకు సంబంధించి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు.