Kiccha Sudeep Campaign: పొలిటికల్ ఎంట్రీపై సుదీప్ క్లారిటీ.. కన్నడ స్టార్ కమలానికి కలిసొస్తాడా ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి సినీ గ్లామర్ యాడయ్యింది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌ కమలదళానికి మద్దతు పలికారు.

  • Written By:
  • Publish Date - April 5, 2023 / 10:35 PM IST

Kiccha Sudeep: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి సినీ గ్లామర్ యాడయ్యింది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌ కమలదళానికి మద్దతు పలికారు. పార్టీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కమలం అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కలిసి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు కిచ్చా సుదీప్‌. సీఎం బొమ్మై తనకు గాఢ్ ఫాదర్ లాంటివారని.. ఆయన కోసం బీజేపీకి సపోర్ట్‌ చేస్తున్నట్టు తెలిపారు. శాండిల్‌వుడ్‌ స్టార్స్‌ కిచ్చా సుదీప్‌, దర్శన్ బీజేపీలో చేరతున్నారంటూ జోరుగా వార్తలు వినిపించాయి. సీఎం బసవరాజ్ బొమ్మై, రాష్ట్రమంత్రి కె. సుధాకర్ వీరితో సంప్రదింపులు జరిపినట్టు ప్రచారం జరిగింది. అయితే రాజకీయాల్లో చేరడం లేదని స్పష్టంచేశారు కిచ్చా సుదీప్‌. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారి తరఫున పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
ఏ నియోజకవర్గానికి పంపిస్తే అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తానని, అంతే తప్ప ఏ పార్టీకీ మద్దతు ఇవ్వట్లేదని పేర్కొన్నారు. బొమ్మైను తాను చిన్నప్పటి నుంచీ చూస్తోన్నానని, ఆయనను వ్యక్తిగతంగా తాను అంకుల్ అని పిలుస్తానని చెప్పారు. ఆ గౌరవభావంతోనే తాను బొమ్మై తరఫున ప్రచారం చేయనున్నట్లు సుదీప్ తెలిపారు. మరోవైపు సీఎం బొమ్మై మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. సుదీప్‌ తనకు మద్దతు పలికారని.. అంటే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టేనని సీఎం బొమ్మై అన్నారు.

శివమొగ్గ జిల్లాకు చెందిన సుదీప్ సంజీవ్.. దీపు, కిచ్చా పేర్లతో సూపర్‌ పాపులర్. ఆయన వాల్మీకి నాయక వర్గానికి చెందిన వ్యక్తి. కర్ణాటకలో వెనుకబడిన తెగలకు చెందిన ఈ వర్గం ప్రాబల్యం అధికంగానే ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీలో ఎస్టీలకు 15, ఎస్సీలకు 36 స్థానాల్లో రిజర్వేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రముఖ మఠాధిపతి ప్రసన్నానందపూరి స్వామి చేసిన దీక్షకు కిచ్చా సుదీప్ మద్దతు కూడా ప్రకటించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన సపోర్ట్ కోసం రాజకీయపార్టీలు పోటీ పడ్డాయి. కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ కూడా ఇటీవల సుదీప్‌తో భేటీ అయ్యారు. దీంతో అప్పట్లోనే కిచ్చా పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరిగింది. జేడీఎస్‌ అయితే 2018 ఎన్నికల టైమ్‌లోనే సుదీప్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే ఈ విషయంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. పార్టీలో చేరకున్నా ప్రచారం చేస్తానని కిచ్చా సుదీప్ ముందుకు రావడం.. బీజేపీకి కలిసొచ్చే అంశమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటకలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. మే 10 న పోలింగ్‌ జరగనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.