Kerala Mans Samadhi : సజీవ సమాధి.. అంటే ప్రాణాలతో బతికి ఉండగానే సమాధి కావడం. గొప్పగొప్ప సాధువులు, సన్యాసులు, మహాత్ములు సజీవ సమాధి అయ్యారనే విషయాన్ని మనం పురాణాలు, ఇతిహాసాల్లో చదువుకున్నాం. అయితే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా నెయ్యతింకార గ్రామానికి చెందిన 69 ఏళ్ల గోపన్ స్వామి అలియాస్ మణ్యన్ అనే వ్యక్తి కూడా సజీవ సమాధి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈవిషయంపై స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే ఊరంతా పోస్టర్లు అంటించడం చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో గోపన్ స్వామి సమాధిని తనిఖీ చేయాలని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన సమాధిని పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో తవ్వి చూడగా.. కూర్చున్న స్థితిలో గోపన్ స్వామి భౌతిక కాయం ఉన్నట్లు వెల్లడైంది. ఆయన సజీవ సమాధి కావడం వల్లే ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమాధిలో గోపన్ స్వామి ఛాతీ భాగం వరకు పూజాసామగ్రి(Kerala Mans Samadhi) నింపి ఉందని పోలీసులు గుర్తించారు. ఆయన డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీకి తరలించారు.
Also Read :Saif Ali Khans Empire: సైఫ్ అలీఖాన్‌కు ఎన్నెన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో తెలుసా ?
ఎవరూ చూడకుండా, ఎవరికీ చెప్పకుండా..
పోలీసుల విచారణలో పలు కీలక వివరాలు వెలుగుచూశాయి. గోపన్ స్వామి చనిపోయినట్లు బంధువులు, స్థానికులు చాలామందికి తెలియజేయలేదు. ఆయన భౌతిక కాయాన్ని గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో పూడ్చిపెట్టారు. ఎవరూ చూడకుండా, ఎవరికీ చెప్పకుండా తనను సమాధి చేయాలని గోపన్ స్వామి చెప్పారని, అందుకే ఇలా చేశామని ఆయన కుమారులు సనందన్, రాజేశన్ పోలీసులకు తెలిపారు. ఈవిషయం జిల్లా కలెక్టర్‌కు తెలిసిన వెంటనే.. సిబ్బందితో వెళ్లి సమాధిని తవ్వి తనిఖీ చేయాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. అయితే అధికారులను గోపన్ స్వామి భార్య, కుమారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమాధిని తవ్వి చూడాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారీ పోలీసు భద్రత నడుమ గోపన్ స్వామి సమాధిని తవ్వారు.