కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

Karur Stampede Case తమిళ రాజకీయ తెరపై పెను తుపాను ముంచుకొస్తోంది. ఒకవైపు సొంత పార్టీ టీవీకే ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. స్టార్ నటుడు విజయ్‌కు సీబీఐ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కరూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు బలిగొన్న భీకర తొక్కిసలాట కేసులో నేడు ఆయన ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. డీఎంకే సర్కార్ వైఫల్యం వల్లే ఆ మరణాలు సంభవించాయని […]

Published By: HashtagU Telugu Desk
TVK Chief Vijay in Delhi for CBI Grilling Over Karur Stampede Case

TVK Chief Vijay in Delhi for CBI Grilling Over Karur Stampede Case

Karur Stampede Case తమిళ రాజకీయ తెరపై పెను తుపాను ముంచుకొస్తోంది. ఒకవైపు సొంత పార్టీ టీవీకే ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. స్టార్ నటుడు విజయ్‌కు సీబీఐ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కరూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు బలిగొన్న భీకర తొక్కిసలాట కేసులో నేడు ఆయన ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. డీఎంకే సర్కార్ వైఫల్యం వల్లే ఆ మరణాలు సంభవించాయని విజయ్ ఆరోపిస్తుంటే.. కాదు విజయ్ నిర్లక్ష్యం వల్లే జనం బలైపోయారని పోలీసులు వాదిస్తున్నారు. దీనికి తోడు విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు సృష్టించడం రాజకీయంగా మరింత ఆసక్తిని రేపుతోంది.

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ.. టీవీకే అధినేత విజయ్ నేడు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే సీబీఐ విజయ్‌కు సమన్లు జారీ చేసింది.

రాజకీయ కుట్రనా.. వైఫల్యమా?

కరూర్ సభలో జరిగిన మరణాలపై అప్పట్లో అధికార డీఎంకే, విజయ్ పార్టీ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. విజయ్ సభకు ఆలస్యంగా రావడం వల్లే జనం అసహనానికి గురై తొక్కిసలాట జరిగిందని పోలీసులు అప్పట్లో ఆరోపించారు. అంతేకాకుండా సభా ప్రాంగణంలో కనీస సదుపాయాలైన తాగునీరు, ఆహారం లేకపోవడం కూడా కారణమని పేర్కొన్నారు. అయితే విజయ్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఇదంతా డీఎంకే ప్రభుత్వం చేసిన రాజకీయ కుట్ర అని, పోలీసుల వైఫల్యం వల్లే జనం ప్రాణాలు పోయాయని ఆయన ఎదురుదాడి చేశారు.

కోర్టుల జోక్యం.. సీబీఐకి బదిలీ

ఈ కేసు విచారణను తొలుత మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (SIT) చేపట్టింది. అయితే నిష్పాక్షిక విచారణ జరగాలని భావించిన సుప్రీం కోర్టు.. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ప్యానెల్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. విచిత్రం ఏమిటంటే.. తమ నేత నిర్దోషి అని నిరూపించుకునేందుకు టీవీకే పార్టీయే స్వయంగా స్వతంత్ర దర్యాప్తును కోరడం గమనార్హం.

మరోవైపు సినిమా వివాదం..

ఒకవైపు సీబీఐ విచారణ జరుగుతుండగానే.. మరోవైపు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో వాయిదా పడింది. దీనిపై విపక్షాలు స్పందిస్తూ.. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ను ఒత్తిడికి గురి చేయడానికే కేంద్రం సీబీఐ, సెన్సార్ బోర్డును వాడుకుంటోందని ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

TVK Chief Vijay in Delhi for CBI Grilling Over Karur Stampede Case విజయ్ తన రాజకీయ శత్రువు డీఎంకే అని, భావజాల శత్రువు బీజేపీ అని ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేపీ-అన్నాడీఎంకే కూటమి మరోవైపు బలంగా తయారవుతుండటంతో.. విజయ్ రాకతో యాంటీ-డీఎంకే ఓట్లు చీలుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణ విజయ్ రాజకీయ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతుందనేది ఆసక్తికరంగా మారింది. సీబీఐ విచారణపై టీవీకే నేతలు స్పందిస్తూ.. “మేము సత్యాన్ని నమ్ముతున్నాం. ఏ ఒత్తిడి వచ్చినా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం” అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

  Last Updated: 12 Jan 2026, 01:19 PM IST