Karnataka: క‌ర్నాట‌క‌లో ఈసారి లౌడ్ స్పీక‌ర్ల ర‌గ‌డ‌..!

  • Written By:
  • Publish Date - April 5, 2022 / 01:44 PM IST

క‌ర్నాట‌క రాష్ట్రంలో కొద్ది రోజులుగా హిజాబ్ వివాదం ర‌చ్చ లేపిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం క‌ర్నాట‌క హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హిజాబ్ వివాదం ప్ర‌స్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే ఇప్పుడు క‌న్న‌డ రాష్ట్రంలో మ‌రో వివాదం పుట్టుకొచ్చింది. ఈ ఈ క్ర‌మంలో తాజాగా క‌ర్నాట‌క‌లో లౌడ్ స్పీకర్ల వివాదం తెరపైకి వచ్చింది. దీంతో ముస్లిం ప్రార్థనాలయాలైన మసీదులపై ఉన్న మైకులను తొలగించాలన్న వాదన తెరపైకి రాగా, ప్ర‌స్తుతం ఈ డిమాండ్‌ను మితవాదులు బలంగా వినిపిస్తున్నారు.

ఇక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం సద్దుమణిగేలోపు లౌడ్ స్పీకర్ల అంశం తెరపైకి రావడం గమనార్హం. ఈ అంశాన్ని బీజేపీ అనుబంధ సంస్థలైన భజరంగ్‌దళ్, శ్రీరామ సేనలు తెరపైకి తీసుకొచ్చాయి. ఈ క్ర‌మంలో మసీదుల్లో ప్రార్థనను మైకుల ద్వారా ప్రసారం చేయడాన్ని నిలిపి వేయకపోతే అవే సమయాల్లో తాము హిందూ ఆలయాల్లో ఓమ్ నవశ్శివాయ, జై శ్రీరామ్, హనుమాన్ చాలీసా, ఇతర ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రసారం చేస్తామని ఆయా సంస్థలు హెచ్చరించాయి.

ఇక‌ ఈ వాదనకు కర్నాటక మంత్రి ఈశ్వరప్ప కూడా సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఈ క్ర‌మంలో ఇదే అంశంపై భజరంగ్ దళ్ నేత భరత్ శెట్టి మాట్లాడుతూ, హనుమాన్ చాలీసాను ప్రసారం చేసేందుకు ఇది పోటీ కాదన్నారు. ముస్లింలు ప్రార్థన చేసేందుకు అభ్యంతరం లేదు కానీ, అదే సమయంలో మైకుల ద్వారా ఆలయాలు, చర్చిల్లో కూడా చేస్తే అపుడు మతాల మధ్య వివాదానికి దారితీస్తుందని, అందువల్ల మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టామ‌ని తెలిపారు. మ‌రి ఇప్ప‌టికే హిజాబ్ వివాదం కార‌ణంగా క‌ర్నాట‌కలో దుమారం రేపిన క్ర‌మంలో, లౌడ్ స్పీక‌ర్ వివాదం ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుందో చూడాలి.