తుంగ‌భ‌ద్ర‌పై మూడు రాష్ట్రాల పోరు..రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణానికి క‌ర్ణాట‌క రెడీ

తుంగ‌భ‌ద్రా న‌ది మీద క‌ర్నాట‌క ప్ర‌భుత్వం రిజ‌ర్వాయ‌ర్ ను నిర్మించాల‌ని త‌ల‌పెట్టింది. దీని నిర్మాణం కోసం స‌రికొత్త లాజిక్ ను ఆ రాష్ట్రం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం తుంగ‌భ‌ద్ర రిజ‌ర్వాయ‌ర్ సామ‌ర్థ్యం 31 టీఎంసీగా మేర‌కు త‌గ్గింద‌ని చెబుతోంది.

  • Written By:
  • Publish Date - October 21, 2021 / 11:00 AM IST

తుంగ‌భ‌ద్రా న‌ది మీద క‌ర్నాట‌క ప్ర‌భుత్వం రిజ‌ర్వాయ‌ర్ ను నిర్మించాల‌ని త‌ల‌పెట్టింది. దీని నిర్మాణం కోసం స‌రికొత్త లాజిక్ ను ఆ రాష్ట్రం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం తుంగ‌భ‌ద్ర రిజ‌ర్వాయ‌ర్ సామ‌ర్థ్యం 31 టీఎంసీగా మేర‌కు త‌గ్గింద‌ని చెబుతోంది. వాస్త‌వంగా 134.7 టీఎంసీల సామ‌ర్థ్యం ఉండాలి. కానీ, నిర్వ‌హ‌ణ లోపం కార‌ణంగా తుంగ‌భ‌ద్ర రిజ‌ర్వాయ‌ర్ 31 టీఎంసీ అడుగులు పూడిపోయింద‌ని క‌ర్నాట‌క వాదిస్తోంది. అందుకే, ఇప్పుడు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్ అవ‌స‌ర‌మ‌ని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. సుమారు 40 టీఎంసీల సామ‌ర్థ్యం ఉండేలా రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది.

కొన్ని ద‌శాబ్దాలుగా తుంగ‌భ‌ద్ర మీద బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్ క‌ట్టాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న పెండింగ్ లో ఉంది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు దానికి ఆ రాష్ట్ర మంత్రివ‌ర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తుంగ‌భ‌ద్ర ఇరిగేష‌న్ అంత‌రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు. ఏపీ, తెలంగాణ‌, క‌ర్నాట‌క రాష్ట్ర ఉమ్మ‌డి ప్రాజెక్టుగా ఉంది. అందుకే, ఇప్పుడు త‌ల‌పెట్టిన బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం చేప‌ట్టాలంటే ఏపీ , తెలంగాణ అనుమ‌తి అవ‌స‌రం. ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో క‌లిసిన త‌రువాత రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం చేప‌డ‌తామ‌ని ఆ రాష్ట్ర సీఎం అంటున్నారు. ప్ర‌స్తుతం బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్ కు సంబంధించిన డీపీఆర్ సిద్ధం అయింది. క‌ర్నాట‌క రాష్ట్రంలోని కొప్ప‌ల్ జిల్లా న‌వేలి వ‌ద్ద నిర్మింంచడానికి ప్ర‌య‌త్నం చేస్తోంది.

సెప్టెంబ‌ర్ మూడో తేదీన ఏపీ, తెలంగాణ‌, క‌ర్నాట‌క రాష్ట్రాల నీటిపారుద‌ల‌శాఖ ఉన్న‌తాధికారుల స‌మావేశం జ‌రిగింది. ఆ స‌మావేశంలో ఏపీ స‌రికొత్త ప్ర‌తిపాద‌న పెట్టింది. రోజుకు 2 టీఎంసీల నీటిని మ‌ళ్లించేలా తుంగ‌భద్ర కెనాల్ కు స‌మాంత‌రంగా మ‌రో కాల్వ తీసేందుకు అంగీక‌రించాల‌ని కోరింది. ఇప్ప‌టికే లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల ద్వారా తొమ్మిది టీఎంసీల నీటిని క‌ర్నాట‌క వాడుకుంటోంద‌ని అంచ‌నా వేసింది. కేటాయింపులు ప్రకారం నాలుగు టీఎంసీలు మాత్ర‌మే క‌ర్నాట‌క తీసుకోవాలి. త‌ద్భిన్నంగా తొమ్మిది టీఎంసీల‌ను మ‌ళ్లిస్తోంది. అంతేకాకుండా 40టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్ కూడా నిర్మాణం చేయ‌డానికి సిద్ద‌మైన క్ర‌మంలో తుంగ‌భ‌ద్ర కెనాల్ కు స‌మాంత‌రంగా కాల్వ తీసుకోవ‌డానికి అనుమ‌తించాల‌ని ఏపీ ప్ర‌తిపాద‌న పెట్టింది. ఇక తెలంగాణ బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణాన్ని వ్య‌తిరేకించింది. ఏపీ, క‌ర్ణాట‌క రాష్ట్రాలు పూర్తి స్థాయిలో కృష్ణా జ‌లాల‌ను మ‌ళ్లించ‌డానికి అనేక లిప్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను నిర్మించిన విష‌యాన్ని గుర్తు చేసింది. సో..మూడు రాష్ట్రాల మ‌ధ్య తెర‌మీద‌కు వ‌చ్చిన తుంగ‌భ‌ద్ర వివాదం ఎటు వైపు దారితీస్తుందో చూద్దాం