Site icon HashtagU Telugu

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ (అప్పూ) ఇమేజ్ ను కర్ణాటక రాజకీయ నేతలు ఎలా వాడుకోబోతున్నారు?

Puneeth Imresizer

Puneeth Imresizer

అప్పూ వి మిస్ యూ. కర్ణాటకలో ఎక్కడ చూసినా ఇదే మాట. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే హార్ట్ అటాక్ తో మరణించడం అందరి మనసులను కలచివేసింది. ఇప్పుడు ఆయన చివరి సినిమా జేమ్స్ విడుదలతో కర్ణాటక మొత్తం అప్పూ మానియా కమ్మేసింది. ఇటు సినీ పరిశ్రమ, అటు థియేటర్ల యాజమాన్యం అంతా కలిసి.. వినూత్న రీతిలో అప్పూ కోసం ఓ ఫేవర్ చేశారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా అప్పూ ఇమేజ్ ను వాడుకునే పనిపై ఫోకస్ పెట్టాయి.

కర్ణాటకలో అప్పూకి మంచి పేరుంది. కేవలం సినిమా హీరోగానే కాకుండా.. మంచి మనసున్న వ్యక్తిగా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయన వ్యక్తిగత ఇమేజ్ పై దృష్టి పెట్టాయి రాజకీయ పార్టీలు. పునీత్ రాజ్ కుమార్ కు ఇప్పటికే కర్ణాటక రత్న అవార్డు ఇస్తామని.. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. దీనికి తగ్గట్టే మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి

అప్పూకు కర్ణాటకలో ఎంత క్రేజ్ ఉందో చెప్పాలంటే.. ఆయన చివరి సినిమా జేమ్స్ విడుదల సందర్భంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలోని సినీ పరిశ్రమతోపాటు థియేటర్ల
యాజమాన్యాలు అన్నీ కలిసి.. మార్చి 17 నుంచి మార్చి 25 వరకు కర్ణాటకలో ఉన్న అన్ని థియేటర్లలో కేవలం అప్పూ నటించిన చివరి చిత్రం జేమ్స్ ను మాత్రమే ప్రదర్శించాలని నిర్ణయించాయి. అప్పూ ఎక్కువగా
కూర్చుని చూసే 17వ నెంబర్ సీటును ఖాళీగా వదిలేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఒక నటుడికి ఇంతకన్నా ఏం గౌరవం దక్కుతుంది?

జేమ్స్ విడుదల సందర్భంగా ఆయన అభిమానులు కూడా థియేటర్ల దగ్గర రక్తదాన శిబిరాలను నిర్వహించారు. కంఠీరవ స్టూడియో స్టూడియో ప్రాంగణంలో దాదాపు లక్షమందికి టిఫిన్లు పెట్టారు. అక్కడే పునీత్ ఫోటో ఉన్న టీషర్టులు, ఫోటో ఫ్రేములను వేల సంఖ్యలో అమ్మారు. ఒక్కో టీషర్ట్ రేటు రూ. 300. ఇంకా థియేటర్ల దగ్గర కాఫీలు, బిస్కెట్లు, దోసెలు, చికెన్ బిర్యానీలు పంపిణీ చేశారు. అంటే అప్పూకి ఉన్న క్రేజ్ ను ఏమాత్రం తగ్గకుండా చూస్తున్నారు. నిజానికి వారికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కానీ పునీత్ రాజ్ కుమార్ అంటే వాళ్లకు ప్రాణం. అందుకే తమ అభిమాన నటుడి కోసమే ఇదంతా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ క్రేజ్ ను పొలిటికల్ పార్టీలు ఎలా వాడుకోబోతున్నాయో చూడాలి.

Exit mobile version