Site icon HashtagU Telugu

Karnataka Minister: కర్నాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు..!!

karnataka minister

karnataka minister

కర్నాటకలో ఓ కాంట్రాక్టర్ అనుమానాస్పద మరణం…రాజకీయంగా ప్రకంపనలే స్రుష్టిస్తోంది. గతంలో పూర్తి చేసిన ఓ కాంట్రాక్టు డబ్బులు విడుదల చేయించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లు ఈ మధ్య ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేసిన బీజేపీ నేత, కాంట్రాక్టర్ అయిన సంతోష్ పాటిల్ ఉడిపిలో ఒక ప్రైవేట్ లాడ్జిలో శవమై కనిపించాడు. తన మరణానికి మంత్రి ఈశ్వరప్పనే కారణమంటూ మీడియాతోపాటు తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ కూడా పంపించినట్లు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో మంత్రి ఈశ్వరప్ప వేధింపుల వల్లే కాంట్రక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఎఫ్ ఐఆర్ లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన సహచరులు బసవరాజ్, రమేష్ పేర్లను కూడా చేర్చారు.

ఇది బీజేపీ ప్రభుత్వ హత్య మంత్రి ఈశ్వరప్పపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేత సిద్ధిరామయ్య డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్నారు. ఇది బీజేపీ గవర్నమెంట్ చేసిన హత్య అని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మండిపడ్డారు. సంతోష్ పాటిల్ ఆరోపణలను ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి బొమ్మై పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతోష్ మృతికి వీరు కూడా కారణమేనని రాహుల్ గాంధీ ట్విట్ చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి ఈశ్వరప్ప ఖండించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని తేల్చి చెప్పారు.