కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య మంత్రి ఈశ్వరప్ప మెడకు చుట్టుకుంది. సివిల్ కాంట్రాక్టర్ మృతికి సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కర్ణాటక ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేసిన ఈశ్వరప్ప కాంట్రాక్టర్ ఆత్మహత్యకు బాధ్యత వహిస్తు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి అందజేస్తానని ఆయన తెలిపారు.
ఉడిపిలోని ఓ హోటల్‌లో శవమై కనిపించిన సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ కె పాటిల్ అనుమానాస్పద ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. 2021లో గ్రామోత్సవానికి ముందు బెలగావిలోని హిందల్గా గ్రామంలో పనిని పూర్తి చేయడానికి మంత్రి ఈశ్వరప్పతో పాటు అతని పీఏ, సన్నిహితులు 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని కాంట్రాక్టర్ ఆరోపించారు. దీంతో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ వచ్చినప్పటికి ఈశ్వరప్ప నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే కాంట్రాక్టర్ మరణం పెద్ద రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి.మంత్రివర్గం నుండి అతనిని తొలగించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నుండి డిమాండ్‌లు వచ్చాయి. చివరికి ఈశ్వరప్ప తన మంత్రిపదవికి రాజీనామా చేశారు.