Site icon HashtagU Telugu

Hijab Row: హిజాబ్ ర‌గ‌డ‌.. ఏడుగురు టీచ‌ర్లు సస్పెన్ష‌న్..!

Hijab Row 7 Teachers Suspended

Hijab Row 7 Teachers Suspended

క‌ర్నాట‌క‌లోని హిజాబ్ వివాదం కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే క‌ర్నాట‌క‌లో గ‌ద‌గ్ జిల్లాలో హిజాబ్ ధ‌రించిన విద్యార్థినుల‌ను ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షలకు అనుమతించిన ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. అస‌లు వివ‌రాల్లోకి వెళితే.. గడగ్‌లోని సీఎస్‌ పాటిల్‌ బాలుర ఉన్నత పాఠశాల, సీఎస్‌ పాటిల్‌ బాలికల ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు జరిగాయి.

ఈ క్ర‌మంలో కొంద‌రు విద్యార్థినులు హిజాబ్ ధ‌రించి వ‌చ్చి, రాశారు. దీంతో హిజాబ్ ధ‌రిస్తే ఎందుకు అనుమ‌తించార‌ని ప్ర‌శ్నిస్తూ ఏడుగురు ఉపాధ్యాయులపై అధికారులు సస్పెన్ష‌న్ వేటు వేశారు. అంతేకాకుండా ఇద్ద‌రు సెంట‌ర్ సూపరింటెండెంట్లను కూడా సస్పెండ్ చేశారు. ఇక మ‌రోవైపు కర్నాటకలోని ప‌లు జిల్లాకు చెందిన ముస్లిం విద్యార్థినులు మంగళవారం జరిగిన మొదటి ప్రీ-యూనివర్శిటీ పరీక్షకు హాజరుకాలేదు. ఈ క్ర‌మంలో హిజాబ్ వివాదం పై ఇటీవ‌ల క‌ర్నాట‌క హైకోర్టు ఇచ్చిన తీర్పుతో, తీవ్ర అసంతృప్తి చెందిన, ఉడిపికి చెందిన 40 మంది ముస్లిం విద్యార్థినులు, మంగ‌ళ‌వారం జ‌రిగిన ప‌రీక్ష‌ల‌కు దూరంగా ఉన్నారు.

వారిలో కుందాపూర్‌కు చెందిన 24 మంది, బైందూరుకు చెందిన 14 మంది, అలాగే ఉడిపి ప్రభుత్వ బాలికల పియు కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఈ ప్రీ యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌ల‌ను బ‌హిష్క‌రించారు. ఈ విద్యార్థినులు గ‌తంలో ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల‌ను కూడా బ‌హిష్క‌రించారు. ఇకపోతే కర్ణాటక పాఠశాలల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను మార్చి 15న కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసిన సంగ‌తి తెలిసిందే. హిజాబ్‌లు ధరించడం ఇస్లాం మ‌తానికి సంబంధించి ముఖ్యమైన ఆచారం కిందకు రాదని క‌ర్నాట‌క హైకోర్టు స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా పాఠ‌శాల‌, క‌ళాశాల‌ల్లో యూనిఫాం ధరించడంపై విధించిన ఆంక్షలు సహేతుకమైనవని, విద్యార్థులు దానిని వ్యతిరేకించలేరని క‌ర్నాట‌క హైకోర్టు తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే.