Site icon HashtagU Telugu

Hijab Row: విస్తృత ధర్మాసనానికి.. క‌ర్నాట‌క‌ హిజాబ్​ కేసు

Hijab Court11

Hijab Court11

కర్ణాటకలో హిజాబ్‌ వివాదం ఇప్ప‌ట్లో ముగిసేలా క‌నిపించ‌డంలేదు. హిజాబ్ ధరించిన మ‌స్లిం కాలేజీ విద్యార్ధినుల‌ను కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, క‌ర్నాట‌క హైకోర్టు నిరాకరించింది. ఈ హిజాబ్‌ వివాదం పై కర్ణాటక హైకోర్టు వ‌రుస‌గా రెండో రోజు విచారణ జరిపింది. ఈ క్రమంలో హిజాబ్‌ అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించి.. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌ పేర్కొన్నారు.

ఇక హిజాబ్ ధరించిన విద్యార్థినులు తరగతి గదుల్లో అనుమతి ఇవ్వడానికి తాత్కాలిక ఆదేశాలను ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాక‌రించింది. ఈ క్ర‌మంలో ఈ విష‌యం పై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని జస్టిస్‌ కృష్ణ దీక్షిత్ తెలిపారు. దీంతో సింగిల్‌ బెంచ్‌ తీర్పుతో తుది తీర్పు వచ్చే వరకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఇక మరోవైపు క‌ర్నాట‌క‌లో స్కూళ్ళు, కాలేజ్‌ల‌ వ‌ద్ద నిరసనలు, ప్రదర్శనలను రెండు వారాల పాటు నిషేధిస్తూ కర్ణాటక పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్ర‌మంలో పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు, ఇత‌ర విద్యాసంస్థ‌ల గేట్ల నుంచి 200 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించరాదన్నార‌. అలాగే ఈ నిషేధం రెండువారాలపాటు అమలవుతుందని క‌ర్నాట‌క పోలీసులు తేల్చి చెప్పారు. ఇక‌ గత నెల ఉడుపిలోని ఓ ప్రభుత్వ కాలేజీ హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను అడ్డుకోవడంతో ఈ వివాదం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. హిజాబ్ ధ‌రించిన వారికి పోటీగా పలువురు విద్యార్ధులు కాషాయ కండువాలను మెడలో వేసుకుని పాఠశాలలకు రావడంతో ఈ వివాదం పెద్ద‌ది అయ్యింది. ఇక ఈ వివాదంలోకి రాజ‌కీయ పార్టీలు కూడా ఎంట్రీ ఇవ్వ‌డంతో హిజాబ్ వివాదం పొలిక‌ల్ ట‌ర్న్ తీసుకుంది.