Karnataka: ట్రంప్‌ హోటల్ రెంటల్ పేరుతో సైబర్ మోసం…

ట్రంప్ పేరుతో యాప్ మోసం, కర్ణాటకలో 150 మందికి కుచ్చుటోపీ. భారీ లాభాలు ఇస్తామంటూ వల వేసి రూ. కోటికి పైగా వసూలు చేసి మోసగాళ్లు పరారయ్యారు

Published By: HashtagU Telugu Desk
Karnataka's Trump Hotel Rental

Karnataka's Trump Hotel Rental

Karnataka: సైబర్ మోసగాళ్లు చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును కూడా వాడుకున్నారు. ‘ట్రంప్ హోటల్ రెంటల్’ అనే పేరుతో ఓ యాప్‌ను రూపొందించి, 150 మందిని మోసం చేసి కోటికి  పైగా వసూలు చేశారు. ఈ స్కామర్లు యాప్‌లో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయని ప్రజలను నమ్మబలికారు. యాప్ చట్టబద్ధమైనదిగా భావించేందుకు ఏఐ ద్వారా రూపొందించిన ట్రంప్ వీడియోలను ప్రసారం చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి బహుమతులు ఇచ్చేందుకు కూడా ఆశ చూపించారు. ఇంకా, ఇంటి నుంచి పనిచేసే అవకాశమూ ఇస్తామని చెబుతూ ప్రలోభపెట్టారు.

దాంతో బెంగళూరు, ధర్మకూరు, మంగళూరు, హవేరి ప్రాంతాల ప్రజలు యాప్‌లో ఇచ్చిన నంబర్‌కు కాల్ చేసి డబ్బు ఇచ్చారు. మొత్తం 150 మంది కోటి రూపాయలకు పైగా పెట్టుబడి చేశారు. నమ్మకం పెంచేందుకు స్కామర్లు ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చారు. కొన్ని రోజుల పాటు చిన్న బహుమతులు కూడా పంపి నమ్మకాన్ని పెంచారు.

తర్వాత, షేర్ల విలువ రోజు రోజుకూ పెరుగుతోందని చూపిస్తూ డిజిట్లు మార్చి వారిని మోసం చేశారు. కొంతకాలం తర్వాత యాప్ నంబర్‌కు కాల్ చేస్తే ఎలాంటి స్పందన రాలేదు. మోసపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హవేరి జిల్లాలోనే 15 మందికి పైగా మోసం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

  Last Updated: 26 May 2025, 04:16 PM IST