Site icon HashtagU Telugu

CM Siddaramaiah : ‘ముడా’ స్కాం.. సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణకు కోర్టు ఆదేశం

CM Siddaramaiah Lokayukta probe

CM Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరోసారి చుక్కెదురైంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో ఆయనపై లోకాయుక్త దర్యాప్తునకు కర్ణాటకలోని ఒక స్పెషల్ కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు రిపోర్టును మూడ నెలల్లోగా తమకు సమర్పించాలని లోకాయుక్తను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యపై(CM Siddaramaiah) ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంబంధిత అధికారులకు కోర్టు నిర్దేశించింది.

Also Read :Hezbollah Vs Israel : ఇజ్రాయెల్‌‌లోని మోసాద్ హెడ్‌క్వార్టర్‌పైకి హిజ్బుల్లా మిస్సైల్.. ఏమైందంటే..

మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)కి చెందిన భూములను సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులకు కేటాయించారంటూ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా సీఎం సిద్దరామయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. తొలుత కొన్ని వారాల పాటు సీఎం సిద్ధరామయ్యకు విచారణ నుంచి మినహాయింపు కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఇటీవలే మరోసారి ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. గవర్నర్ ఆదేశాల్లో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ చట్టప్రకారమే ఆదేశాలు జారీ చేశారని తేల్చి చెప్పింది. విచారణకు సహకరించాలని సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు సూచించింది. ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈనేపథ్యంలో ఇవాళ బెంగళూరులో ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టు ముడా స్కాం కేసుపై విచారణ జరిపింది. ఆయనను విచారించాలని లోకాయుక్తకు ఆదేశాలు ఇచ్చింది.

Also Read :Air Travel : 50 నిమిషాలు పెరగనున్న ఫ్లైట్ జర్నీ టైం.. ఎందుకు ?

ఈ పరిణామాలపై తాజాగా స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిజమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. బీజేపీ, జేడీఎస్ కలిసి తనపై ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు ‘ఆపరేషన్ లోటస్’ను బీజేపీ మొదలుపెట్టిందని ఆరోపించారు. న్యాయపోరాటం కొనసాగిస్తానని సిద్ధరామయ్య తెలిపారు.