Site icon HashtagU Telugu

Karnataka Politics: కర్నాటకలో ‘బొమ్మైలాట’

Baswaraj Bommai

Baswaraj Bommai

కర్నాటక రాజకీయాల్లో ఎప్పుడేం మార్పు జరుగుతుందో తెలీదు. ఢిల్లీ బీజేపీ తలచుకోవడం ఆలస్యం కర్నాటకలో సీఎంలు మారిపోతుంటారు. అసలు సీఎం ఢిల్లీ వెళ్తున్నారంటే చాలు.. ముఖ్యమంత్రి మార్పేనంటూ ప్రతిసారి చర్చ జరుగుతుంటుంది. ఈసారి కూడా అందుకు అతీతం కాదు. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మళ్లీ ఢిల్లీ వెళ్లారు. ఇందులో కొత్త, వింత లేకపోయినా.. జస్ట్ పది రోజుల వ్యవధిలోనే రెండోసారి హస్తిన వెళ్లి అమిత్‌షా గడప తొక్కడం చూసి.. ఏదో జరుగుతోందనుకుంటున్నారు. కర్నాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కన్నడ రాజకీయాలన్నీ హాట్ హాట్‌గా ఉన్నాయి. ఏ చిన్న అలజడి రేగినా.. అది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే హిజాబ్ వివాదం నడుస్తోంది. మాంసం అమ్మకాలు, మత మార్పిడిల అంశం కూడా హాట్ టాపిక్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే.. పార్టీలో నెలకొన్న అసంతృప్తి. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తున్నా సరే.. ఇంకా మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. దీనిపై కర్నాటక సీఎం బొమ్మైపై ఒత్తిడి పెరుగుతోంది.

ప్రస్తుతం కర్నాటక క్యాబినెట్‌లో 29 మంది మంత్రులు ఉన్నారు. లెక్క ప్రకారం ఇంకా ఐదుగురికి ఛాన్స్ ఉంది. మంత్రి పదవి తమకు కావాలంటే తమకు కావాలంటూ పోరు పెడుతున్నారు. ఇప్పుడు మంత్రి పదవులు ఇస్తే.. ఎక్కడ అసంతృప్తి రగులుతుందో అనేది బొమ్మై టెన్షన్. అందుకే, మంత్రివర్గ విస్తరణపై మాట్లాడేందుకు పది రోజుల గ్యాప్‌లోనే రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. అంతే తప్ప సీఎం మార్పు మాత్రం కాదని కొందరు బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయినా వచ్చే ఏడాది ఎన్నికలు పెట్టుకుని, ఇప్పుడెలా సీఎంను మారుస్తారని కూడా చెబుతున్నారు. మొన్న అమిత్‌షా కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. కర్నాటకలో నాయకత్వ మార్పు ఉండదని హామీ ఇచ్చారు. అయినా సరే గాసిప్స్ ఆగడం లేదు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ చేయకపోవడమే మంచిదని కర్నాటక బీజేపీలోకి కొందరు నేతలు చెబుతున్నారు. మంత్రి పదవి వచ్చినా ఈ ఏడాదిలో సాధించేది ఏదీ ఉండదని, పైగా అసంతృప్తిని రాజేసినట్టు ఉంటుందని అధిష్టానానికి సలహా ఇస్తున్నారు.