కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయగా, గవర్నర్ ఆ రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం. దీంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందకు లైన్ క్లియరైంది. రాజీనామా అనంతరం సిద్దరామయ్య తన మంత్రివర్గ సభ్యులతో సమావేశమై పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్‌తో ఆయన ఏకాంతంగా చర్చించారు. ఇటు పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.
అధికార మార్పిడికి సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతలు.. ముఖ్యంగా రాహుల్ గాంధీతో కీలక చర్చలు జరిగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కుదిరిన అధికార భాగస్వామ్య అవగాహనలో భాగంగానే ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
గవర్నర్ సిద్దరామయ్య రాజీనామాను ఆమోదించడంతో కాంగ్రెస్ శాసనసభాపక్షం కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియకు మార్గం ఏర్పడింది. రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపేందుకు డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి కొత్త ముఖ్యమంత్రి పేరు అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది. రేపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి
