Karnataka BJP: వారెవా! కర్ణాటక బీజేపీ ఐడియా.. ప్రతిపక్షం చేసే పనిని కూడా అదే చేసేస్తుందా?

అధికారంలో ఉన్నవారికి అంతా సుఖం, సంతోషం ఉంటుంది అనుకుంటారు. ఇది నిజమే అయినా క్షణక్షణం భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏవైపు నుంచి ఎవరు తమ కుర్చీలు తన్నుకుపోతారో..

  • Written By:
  • Publish Date - April 13, 2022 / 12:11 PM IST

అధికారంలో ఉన్నవారికి అంతా సుఖం, సంతోషం ఉంటుంది అనుకుంటారు. ఇది నిజమే అయినా క్షణక్షణం భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏవైపు నుంచి ఎవరు తమ కుర్చీలు తన్నుకుపోతారో.. ఎవరు తమ పవర్ కేస్తారో అని ఆందోళన చెందుతారు. కర్ణాటకలో ఇప్పుడు బీజేపీని ఇదే వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వకుండా పెద్ద స్కెచ్ వేసింది. అప్పోజిషన్ పాత్రనూ తానే పోషించడానికి సిద్ధమైంది.

కర్ణాటకలో ఈమధ్య వరుస వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రజల్లో కమలానికి ఉన్న పట్టు తగ్గుతోంది. ఎన్నికల ముందు వేసే జిమ్మిక్కుల మాట ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆ పాజిటివ్ కార్నర్ తగ్గితే డేంజర్ అని భావించడంతో పెద్ద స్కెచ్ వేసింది అధిష్టానం. అందుకే ప్రతిపక్షానికి చోటివ్వకుండా వివిధ సమస్యలపై తానే ముందుగా ప్రజల్లోకి వెళ్లడానికి డిసైడ్ అయ్యింది.

నిత్యావసర వస్తువుల ధరలు, మతపరమైన వివాదాలనే టార్గెట్ గా చేసుకుని.. అందులో తమ తప్పేమీ లేదని సర్ది చెప్పడానికి.. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేయడానికి పెద్ద ప్లాన్ వేసింది. దీనికి అవసరమైన సలహాలు, సూచలు ఢిల్లీ అధిష్టానం నుంచే వస్తున్నాయి. పార్టీలో ముగ్గురు నేతల నేతృత్వంలో మూడు బృందాలను ఏర్పాటుచేసింది. సీఎం బసవరాజ బొమ్మై, యడియూరప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్.. ఈ ముగ్గురే ఈ టీమ్ లకు నాయకత్వం వహిస్తారు. ఒక టీమ్ తరువాత మరో టీమ్ వివిధ సమస్యలపై జనం ముందుకు వెళుతుంది.

క్షేత్రస్థాయిలో బూత్, తాలూకా, జిల్లా స్థాయి నేతలతో సమావేశాలు, అవగాహనా కార్యక్రమాలను చేపట్టడమే ఈ టీమ్ లక్ష్యం. అదే సమయంలో ప్రజలకు సమస్యలను, వాటి కారణాలను వివరిస్తాయి. మొత్తానికి అమిత్ షా ఇచ్చిన 150 సీట్ల లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఆ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాల్సింది అధికారంలో ఉన్న పార్టీయే కదా అన్న సంగతిని ఎప్పుడు గుర్తిస్తారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.