Site icon HashtagU Telugu

Karnataka: కర్ణాటకలో బీజేపీకి ఏమైంది!

కన్నడ నేలపై మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు. అందుకే వరుసగా చాలా మార్పులు చేసుకుంటూ వస్తోంది. కానీ దానికి తగ్గట్టే వరుస వివాదాలు దానిని చుట్టుముడుతున్నాయి. ఈశ్వరప్ప ఉదంతం మర్చిపోకముందే.. ఇప్పుడు ఎమ్మెల్యేల నుంచి నిరసన గళం వినిపిస్తోంది. రాష్ట్ర హోంమంత్రి అరాగా జ్ఞానేందర్ ను ఆ పదవి నుంచి తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ డిమాండ్ చేశారు. జ్ఞానేందర్ వైఖరిని తీవ్రంగా నిరసించారు. రాష్ట్రంలో నేరాలకు అడ్డుకట్ట వేయడంలో జ్ఞానేంద్ర ఫెయిల్ అయ్యారని ఆరోపించారు.

హోంమంత్రి జ్ఞానేంద్ర శాంతంగా ఉంటారని.. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి, అంతటి శాంతస్వభావం ఉన్నవారు హోం శాఖకు పనికిరారని విమర్శించారు బసన్ గౌడ. అందుకే ఆయనను ఆ శాఖ నుంచి తప్పించి ఇతర శాఖలు అప్పగించాలని డిమాండ్ చేశారు. అధిష్టానం కూడా తన డిమాండ్ పై స్పందిస్తుందని ఆశించారు. నిజానికి బీజేపీలో ఇలాంటివాటిని పార్టీ హైకమాండ్ అస్సలు ఒప్పుకోదు. మరి బసన్ గౌడ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఈమధ్యనే ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ నేత అయిన సంతోష్ ను ఓ కాంట్రాక్ట్ విషయంలో లంచం అడిగారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ. పైగా కాంట్రాక్ట్ పని డబ్బు రావాలంటే 40 శాతం కమిషన్ ఇవ్వా్ల్సిందే అని తనను వేధించారని.. తాను దీనిని భరించలేకపోతున్నా అని సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కర్ణాటకలో సంచలనం సృష్టించింది. దీంతో ఈశ్వరప్ప రాజీనామాకు పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఆయన తన పదవికి రిజైన్ చేశారు.

Exit mobile version