Gobi Manchurian : కృత్రిమ ఫుడ్ కలర్‌తో చేసే గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ (పీచు మిఠాయి)లు ఆరోగ్యానికి హానికరం. అందుకే వాటి అమ్మకాలపై కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ విధించింది. గోబీ మంచూరియా, కాటన్ క్యాండీలలో రంగుల కోసం రోడమైన్-బి అనే రసాయన ఏజెంట్ వాడుతుంటారు. అది చాలా డేంజరస్. అందుకే ఆ కెమికల్‌ను కలిపి తయారుచేసే గోబీ మంచూరియా, కాటన్ క్యాండీలను విక్రయించరాదని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావు ఈవివరాలను మీడియాకు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు ఫుడ్ సెంటర్ల నుంచి 171 శాంపిళ్లను సేకరించి పరీక్షించగా.. 107 పదార్థాల్లో హానికారక కృత్రిమ రంగులు ఉన్నట్లు వెల్లడైందని ఆయన తెలిపారు. వాటిలో రోడమైన్-బి, టాట్రజైన్ వంటి రసాయనాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. కలర్డ్ గోబీ మంచూరియా(Gobi Manchurian), పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. రసాయనాలను ఉపయోగించే ఫుడ్ సెంటర్లపై కేసు నమోదు చేస్తామన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నిబంధలను పాటించని వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు లైసెన్సును రద్దు చేస్తామని పేర్కొన్నారు. రంగులు అద్దని తెల్లని పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం లేదని, వాటి విక్రయాలు కొనసాగించొచ్చని ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు.
Also Read : Beard Benefits: అబ్బాయిలకు గడ్డం వల్ల కలిగే లాభాలు ఇవే?
- ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదేవిధమైన నిర్ణయం తీసుకుంది. ‘రోడమైన్-బి’ వాడుతున్నారనే కారణంతో పీచు మిఠాయి విక్రయాలను బ్యాన్ చేసింది.
- కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ కాటన్ క్యాండీపై బ్యాన్ ఇప్పటికే అమల్లో ఉంది.
- ఈ రోడమైన్-బిని ‘ఇండస్ట్రియల్ డై’గా పిలుస్తారు.
- దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లో ఈ రోడమైన్-బిని వినియోగిస్తారు.
- ఫుడ్ కలరింగ్ కోసం ఈ కెమికల్‌ను వినియోగించకూడదు.
- ఈ కెమికల్ శరీరంలోకి వెళ్తే కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అల్సర్ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది.