కర్ణాటకలో ఎన్నికల నగరా మోగింది. మే పదో తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మే 13వ తేదీన కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నాటి నుంచే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
ఒకే విడతలో…. ఎనభైఏళ్ల పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 20వ తేదీగా నిర్ణయించారు. నామినేషన్లను ఏప్రిల్ 24వ తేదీలోగా ఉపసంహరించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈరోజు నుంచే కర్ణాటకలో ఎన్నికలకోడ్ అమలులోకి రానుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఊహించిన ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రచార పర్వం, అభ్యర్థులను ఎంపికపై కసరత్తులు చేసి రెడీగా ఉంది.
♦ కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు.
♦ ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు.
♦ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా ‘ఓటు ఫ్రమ్ హోం’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
♦80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు.