మక్కల్ నీది మయ్యం పార్టీను బలోపేతం చేసేందుకు కమల్ హాసన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ క్రమంలో కమల్ పర్యటణ కోసం రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఇక తమిళనాడులో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 150 స్థానాల్లో పోటీ చేసిన కమల్ హాసన్ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కమల్ హాసన్ సైతం ఓటమి పాలయ్యారు. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ హాసన్, బీజేపీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్ చేతిలో 1500 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇక తమిళనాడులో ఇటీవలి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కమల్ పార్టీకి నిరాశే మిగిలింది. దీంతో పార్టీని సంస్థాగత స్థాయి నుంచి బలోపేతం చేసి, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కమల్ హాసన్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఇందుకోసం తమిళనాడులో రాష్ట్ర పర్యటనకు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో కమల్ హాసన్ తన పర్యటనలో ప్రజాగళాన్ని తన గళంగా వినిపించే విధంగా ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని పార్టీ వర్గాల ద్వారా స్థానిక సమస్యలపై అధ్యయానికి నిర్ణయించారు.
ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని రేషన్ దుకాణాలు, గ్రామీణ ప్రజలు ఏకమయ్యే రచ్చ బండల వద్దకు చేరుకుని స్థానిక సమస్యలను తెలుసుకునే పనిలో మక్కల్ నీది మయ్యం వర్గా లు నిమగ్నమయ్యాయి. ఇప్పటి నుంచే ప్రజల్లో మమేకమయ్యే విధంగా కమల్ హాసన్ కార్యక్రమాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మక్కల్ నీది మయ్యంను బలమైన పార్టీగా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి గత ఎన్నికల్లో ఊహించని విదంగా ఘోరంగా ఓడిపోయిన కమల్ పార్టీ, వచ్చే ఎన్నికల్లో అయినా సత్తా చాటుతుందో లేదో చూడాలి.