Site icon HashtagU Telugu

Karnataka Hijab Row : హిజాబ్ ర‌గ‌డ.. క‌మ‌ల్ హాస‌న్ షాకింగ్ రియాక్ష‌న్

Kamal Hasan

Kamal Hasan

హిజాబ్ ర‌గ‌డ క‌ర్నాట‌కు కుదిపేస్తుంది. క‌ర్నాట‌క‌లోని ఉడిపిలో మొద‌లైన ఈ వివాదం, రోజు రోజుకూ ముదిరి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. నిన్న., మొన్న‌టి వ‌ర‌కు కలిసి మెలిసి చదువుకున్న విద్యార్థులు, ఇప్పుడు మతాలవారీగా విడిపోయి ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో పరిస్థితి దాదాపు చేయిదాటుతున్న నేప‌ధ్యంలో, క‌ర్నాట‌క ప్ర‌భుత్వం అక్క‌డ మూడు రోజుల పాటు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది.

ఇక పొలిక‌ల్ ట‌ర్న్ తీసుకున్న హిజాబ్ ఇష్యూ పై రాజ‌కీయ నాయ‌కులు ఒక‌రి పై మ‌రొక‌రు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా యూనివ‌ర్శ‌ల్ స్టార్, త‌మిళ‌నాడు మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పందిచారు. విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని క‌మ‌ల్ హాస‌న్ అన్నారు. కర్ణాటకలో జ‌రుగుతున్న హిజాబ్ ఇష్యూ పొరుగు రాష్ట్రాలకు విస్త‌రించే అవ‌కాశం ఉంద‌ని, దీంతో తమిళనాడుతో సహా ఇత‌ర ప్రాంతాల వారు అప్ప‌మ‌త్తంగా ఉండాల‌ని క‌మ‌ల్ హెచ్చిరించారు. విద్యాలయాల్లో ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డం దారుణ‌మ‌ని విల‌క్ష‌ణ న‌టుడు అభిప్రాయ ప‌డ్డారు.

ఇక ద‌క్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం క‌ర్నాట‌కలో, ఇలా పిల్లల మధ్య మత ఘర్షణలు తలెత్తే దుస్థితి రావ‌డంతో, కాంగ్రెస్‌తో స‌హా ఇత‌ర పార్టీ నేత‌లు, బీజేపీ పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో హిజ‌బ్ ఇష్యూ ఇప్పుడు క‌ర్నాట‌క‌తో పాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి రాష్ట్రాల‌ను కూడా ట‌చ్ చేసింది. ఇక మరోవైపు హిజాబ్‌ వివాదంపై కర్నాటక హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ క్ర‌మంలో అన్నివర్గాల ఆచారసాంప్రదాయాలను తాము గౌరవిస్తామని స్ప‌ష్టం చేసిన హైకోర్టు విద్యార్ధులు రోడ్డెక్కకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఎవ‌రి న‌మ్మ‌కాలు వారికి ఉన్నా, రాజ్యాంగ‌మే త‌మ‌కు దైవ‌మ‌ని హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇక క‌ర్నాట‌క‌లో ర‌చ్చ లేపిన‌ హిజాబ్‌ వివాదం పై ఈరోజు హైకోర్టు తుతి తీర్పు ఇచ్చే అవ‌కాశం ఉంది.