Kamal Haasan : ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ తాజాగా ఒక భాషా వివాదంలో చిక్కుకున్నారు. తాను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్ ఈవెంట్‌లో “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అనే వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాఖ్యల ప్రభావం రాజకీయ స్థాయికి కూడా వెళ్ళింది. కమల్ హాసన్ త్వరలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా, ఈ వివాదం నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘థగ్ లైఫ్’ సినిమాకు సంబంధించిన వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ దాఖలు చేస్తానని కమల్ భావిస్తున్నట్లు సమాచారం.
Read Also: 8th Pay Commission: 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. భారీగా పెరగనున్న జీతాలు?
కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ప్రస్తుతం విపక్షాల ఐక్యతైన ‘ఇండియా’ కూటమిలో భాగంగా ఉంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించింది. ఆ ఒప్పందం ప్రకారం తమిళనాడు మరియు పుదుచ్చేరిలో ఎంఎన్‌ఎం ప్రచారం చేసింది. 2025లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో, ఎంఎన్‌ఎంకు ఒక స్థానాన్ని కేటాయించేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించినట్లు సమాచారం. దీంతో కమల్ రాజ్యసభకు వెళ్ళనున్నారని ఇటీవలి సమావేశాల్లో నిర్ణయించుకున్నారు.
అయితే తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, కమల్ రాజ్యసభ నామినేషన్‌పై తాత్కాలిక వెనకడుగు వేశారు. కర్ణాటక హైకోర్టు మంగళవారం పిటిషన్‌పై విచారణ జరిపింది. కమల్ హాసన్ వ్యాఖ్యలు అనుచితమని పేర్కొంటూ, క్షమాపణ చెప్పాలన్న సూచనను చేసింది. కమల్ హాసన్ అయితే వెంటనే స్పందిస్తూ తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు అంటూ కేఎఫ్‌సీసీకి లేఖ రాసినా, అందులో క్షమాపణ కోరకపోవడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో కమల్ ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని కర్ణాటకలో తాత్కాలికంగా విడుదల చేయకూడదని నిర్ణయించారు. వివాదం మరింత ముదరకుండా ఉండేందుకు తీసుకున్న ఈ నిర్ణయం, ఆయన రాజకీయ ప్రయాణంపై తాత్కాలిక ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ రాజకీయంగా తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన రాజ్యసభ ప్రవేశం ఎలా సాగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ‘థగ్ లైఫ్’ వివాదం ఆయన సినీ, రాజకీయ పరిపరిణామాలపై ఎంతమేర ప్రభావం చూపుతుందనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.