అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి సామాన్య ప్రజలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఒక సమన్వయ యంత్రాంగాన్ని రూపొందించాలని నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రులందరితో తక్షణమే ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపును తాను పూర్తిగా సమర్థిస్తున్నానని, ఇలాంటి క్లిష్ట సమయాల్లో జాతీయ బాధ్యత అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా నాలుగు నిమిషాల నిడివి గల వీడియో సందేశాన్ని పోస్ట్ చేసిన కమల్ హాసన్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంక్షోభం, భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఇరాన్ యుద్ధం కారణంగా సముద్ర వాణిజ్య మార్గాలు స్తంభించాయి. దీనివల్ల మన వంటిళ్లపై, ఇళ్లపై భారం పడుతోంది. చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
India has overcome wars, shortages, and global crises before – through unity and shared sacrifice. This moment calls for the same national spirit again. 🇮🇳 pic.twitter.com/Mi56m0I4pD
— Kamal Haasan (@ikamalhaasan) May 22, 2026
“ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, కానీ దేశం శాశ్వతంగా ఉంటుంది” అని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. త్యాగం కేవలం పౌరుల నుంచి మాత్రమే ఆశించకూడదని, ప్రభుత్వాలు కూడా ఈ భారాన్ని పంచుకోవాలని హితవు పలికారు. ప్రజలపై ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించేందుకు కమల్ హాసన్ రెండు తక్షణ చర్యలను సూచించారు. మొదటిది.. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాలు విధించే వ్యాట్ వంటి పన్నులను తగ్గించాలని, రెండవది.. మెట్రో, రైలు ఛార్జీలను కూడా తగ్గించడం ద్వారా ఎక్కువ మంది ప్రైవేట్ వాహనాలను వదిలి ప్రజా రవాణా వైపు మళ్లేలా ప్రోత్సహించాలని అన్నారు.
గతంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారతీయులంతా ఐక్యంగా నిలిచారని గుర్తుచేశారు. 1962 చైనా యుద్ధం సమయంలో సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల కోసం ప్రజలు తమ ఇళ్లలోని బంగారాన్ని విరాళంగా ఇచ్చారని, 1965 పాకిస్థాన్ యుద్ధం సమయంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు మేరకు వారానికి ఒక పూట భోజనం మానేశారని ఉదహరించారు. మన పెద్దలే అంతటి త్యాగాలు చేసినప్పుడు, మనం దేశం కోసం కనీసం ఇంధనాన్ని ఆదా చేయలేమా? అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ హయాంలో పునరుత్పాదక ఇంధన రంగం గణనీయంగా వృద్ధి చెందిందని ప్రశంసించారు. దిగుమతి చేసుకునే చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సౌర, పవన, అణుశక్తి చాలా ముఖ్యమని ఆయన నొక్కిచెప్పారు. ఈ సంక్షోభాన్ని అందరం కలిసి ఎదుర్కొంటే భారత్ మరింత బలంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
