Jallikattu : జల్లికట్టు సీజన్ మొదలైంది. పుదుక్కోట్టైలో 70 మందికి గాయాలు!!

సంక్రాంతి (Sankranti) పండుగను పురస్కరించుకొని తమిళనాడులో జల్లికట్టు సీజన్ మొదలైంది.

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమిళనాడులో జల్లికట్టు సీజన్ (Jallikattu Season) మొదలైంది. పుదుక్కోట్టైలోని తచ్చన్‌ కురిచి గ్రామంలోని సెయింట్‌ అడకల్‌ నాధర్‌ చర్చి ప్రాంగణంలో “సమైక్యత పొంగల్‌” వేడుకల పేరుతో ఈ పోటీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా శిక్షణ పొందిన 300 కంటే ఎక్కువ ఎద్దులను ఒకదాని తర్వాత ఒకటిగా క్రీడా మైదానంలోకి పంపారు. ఎద్దులపై పట్టు సాధించేందుకు కనీసం 500 మంది పోటీ పడ్డారు. ఈక్రమంలో ప్రేక్షకులు, పాల్గొన్నవారు, కొంతమంది పోలీసు సిబ్బందితో సహా 70 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరు ఆసుపత్రి పాలయ్యారు. వేదిక ప్రాంగణంలో రద్దీని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. మాజీ మంత్రి విజయభాస్కర్‌ పెంచుకుంటున్న ఎద్దుతో సహా పలు ఎద్దులు ఎవరికి పట్టుబడలేదు. వాటి యజమానులకు, 17కు పైగా ఎద్దులను అదుపుచేసిన క్రీడాకారులకు మోటార్‌ సైకిళ్లు, ప్రెషర్ కుక్కర్లు, మంచాలతో సహా విలువైన బహుమతులు అందజేసి అభినందించారు.

రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా:

అంతకుముందు రాష్ట్ర మంత్రులు రఘుపతి, మెయ్యనాధన్‌, జిల్లా కలెక్టర్‌ కవితా రాములు జల్లికట్టు (Jallikattu) పోటీలను ప్రారంభించారు.జిల్లా యంత్రాంగం నుంచి ముందే టోకెన్లు పొందిన 235 మంది క్రీడాకారులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రసిద్ధిచెందిన 15 ఆలయాలకు చెందిన ఎద్దులను కూడా అనుమతించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ పోటీలు తిలకించేందుకు పుదుకోట జిల్లావాసులు మాత్రమే కాకుండా పలు ప్రాంతాల నుంచి వీక్షకులు తరలివచ్చారు. తొక్కిసలాట చోటుచేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జీ జరిపి జనాలను ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టారు.

Also Read:  First Robot Lawyer : ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..!