Caste Census: కులగణన (Caste Census) మావోయిస్టుల సిద్ధాంతమే అయితే,వాళ్ళు ప్రధాని మోడీని కూడా ప్రభావితం చేశారనే భావించాలి.లేకపోతే ఏడాది లోపే ప్రధాని తన నిర్ణయాన్ని ఎలా మార్చుకుంటారు? కులగణన వ్యవహారం మావోయిస్టుల ఆలోచనగా ఆరోపణలు చేసిన మోడీ రాజకీయ ప్రయోజనాల కోసమే అయినప్పటికీ,రాహుల్ గాంధీ డిమాండుకు ఒప్పుకోవడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
”కుల గణన కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ అర్బన్ నక్సలైట్ల ఆలోచన.వారి సిద్ధాంతం.సామాజిక-ఆర్థిక సర్వే,కుల గణన కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రతిపాదన ప్రజల వ్యక్తిగత ఆస్తి హక్కుకు ముప్పు.ఇది ముమ్మాటికీ మావోయిస్టు భావజాల ప్రతిధ్వని.కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సూచన ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబాటు.ఇది కాంగ్రెస్ విధానాలలో మావోయిస్టు ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది.కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్ని దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నారనే వాస్తవాన్ని దేశానికి తెలియజేసే బాధ్యత నాపై ఉంది. దేశ వనరులపై మొదటి హక్కు ఎవరికి ఉందో డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టంగా చెప్పారు.2024 ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై ముస్లిం లీగ్ ముద్ర ఉంది.వారు రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారో,అంబేద్కర్‌ను ఎలా అవమానిస్తున్నారో అందరికీ తెలుసు.ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లకు ముప్పు ఉంది.దీని గురించి నేను దేశ ప్రజలకు తెలియజేయకూడదా? భారత రాజ్యాంగం రూపొందించబడినప్పుడు,ఆర్‌ఎస్‌ఎస్ లేదా బిజెపి వ్యక్తులు ఎవరూ అక్కడ లేరు.పండిట్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులు అక్కడ ఉన్నారు,చాలా కాలం ఆలోచించిన తర్వాత, భారతదేశం వంటి దేశంలో మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేమని నిర్ణయించుకున్నారు”అని ప్రధాని మోడీ 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు.
”షెడ్యూల్ కులాలు,తెగలు తప్ప మిగిలిన కులాలను లెక్కించడం మా విధానం కాదు” అని 2021 జూలై 20న అప్పటి హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటులో ప్రకటించారు.1990లో మండల్ కమిషన్ రాజకీయాలను వ్యతిరేకించిన బీజేపీ అప్పటినుంచి అదే వాదనకు కట్టుబడి ఉంది.కులగణన సామాజిక ఐక్యతను దెబ్బతీస్తుందన్నది బీజేపీ నాయకుల ఆరోపణ.అర్బన్ నక్సల్ అనే పదం నగరాల్లో నివసిస్తున్న మావోయిస్టు సానుభూతిపరులను సూచిస్తుంది,భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని వ్యతిరేకించే వారిని ట్యాగ్ చేయడానికి మోడీ,అమిత్ షా ఈ ‘లేబుల్’ను బలంగా ఉపయోగిస్తున్నారు.దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనను విమర్శించడానికి కూడా అర్బన్ నక్సల్ ముద్ర వేస్తున్నారు.
కులగణన అవసరాన్ని,ప్రాధాన్యాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జాతీయస్థాయిలో పదే పదే ప్రస్తావించడంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులసర్వే హామీని నిలబెట్టుకోవడంతో బీజేపీకి ఈ అంశం రాజకీయ సవాలుగా మారింది.అందుకే బిహార్ ఎన్నికలకు ముందు దీనిపై కేంద్రం ప్రకటన చేసినట్టు పరిశీలకులు అంటున్నారు.సామాజిక న్యాయం అమలుకావాలంటే కులగణన తప్పనిసరిగా జరగాలి. నిధులు,నియామకాలు,సంక్షేమపథకాలు,విధానాల రూపకల్పన,రాజకీయ అధికారంలో కులాల లెక్కల ప్రకారం వాటా వంటి ప్రక్రియల్లో కులగణన కీలకంగా మారనుంది.బీసీల రిజర్వేషన్లు రాష్ట్రానికో రకంగా ఉన్నాయి.రాష్ట్రాలు చేపట్టిన సర్వేల ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తున్నారు.ఎస్సీ,ఎస్టీల జనాభాకు తగిన నిష్పత్తిల్లో రిజర్వేషన్లు ఇస్తే,బీసీలకు మాత్రం వారి జనాభాలో సగం నిష్పత్తికే రిజర్వేషన్ ఇస్తున్నారన్న విమర్శలున్నవి.
ఎట్టకేలకు దేశంలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.తదుపరి జనగణన సందర్భంగా కులగణనను చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.కేంద్రం నిర్ణయాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వాగతించారు.కులగణనకు తెలంగాణ రాష్ట్రం ఒక నమూనాగా నిలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌లో కులగణన జరగలేదు. బ్రిటిష్ పాలనా కాలంలో 1931లో చివరిసారిగా కులగణన జరిగింది.అయితే ఎస్సీ,ఎస్టీ జనాభా లెక్కలు మాత్రం పదేళ్లకోసారి జరిపే జనగణనలో సేకరిస్తున్నారు.దేశంలో చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు సేకరించారు.2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్లకు తొలిసారి కులాల లెక్కలు తేల్చేందుకు అడుగులు పడుతున్నాయి.1931 జనాభా లెక్కల్లో కులాల సంఖ్య 4,147గా ఉండేది.కానీ, 2011 జనాభా లెక్కల్లో ఈ సంఖ్య 46 లక్షలకుపైనే ఉన్నట్లు కనిపిస్తున్నాయని కేంద్రం తెలిపింది.రాజ్యాంగం ప్రకారం జనగణన నిర్వహించే అధికారం రాష్ట్రాలకు లేదు.కానీ కుల సర్వే జరపవచ్చు. భారత దేశంలో ఇప్పటిదాకా అధికారికంగా తెలంగాణ,కర్ణాటక,బిహార్ రాష్ట్రాల్లో కులాలసర్వే జరిగింది.
మండల్ కమిషన్ అంచనా ప్రకారం దేశంలో బీసీలు 52 శాతం ఉంటే,వారికి 27 శాతం రిజర్వేషన్ ఉంది.ఇక ఓసీల జనాభా చాలా తక్కువ ఉన్నప్పటికీ వారిపై ఏ సర్వే లేకుండానే నేరుగా ఎస్టీల కంటే ఎక్కువగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల కింద10 శాతం రిజర్వేషన్ అమలవుతోందనే విమర్శలున్నవి.ఏ కులానికి చెందిన ప్రజల స్థితి ఏంటి? ఆయా కులాల్లో పేదల శాతం ఎంత? ఏ కులం వారు ఏ ప్రాంతంలో ఏ ఆర్థిక స్థితిలో ఉన్నారో తెలిస్తే అప్పుడు దానికి తగ్గట్టు రిజర్వేషన్ల అంశంతో పాటూ సంక్షేమ పథకాల అమల్లోనూ మార్పు ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.కులగణన వల్ల సమాజంలో వనరులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది.అవి ఎవరి దగ్గర పోగుపడ్డాయో కూడా తెలుసుకోవచ్చు.అసమానతలు ఉంటే కులగణనతో మేలు జరుగుతుంది.దేశంలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీలకు విద్య,ఉపాధి,రాజకీయాధికారం విషయంలో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదన్న ఆవేదన చాలాకాలంగా ఉన్నది.
కులరహిత సమాజాన్ని సృష్టించాలి. కుల జాడ్యాన్ని వదిలించాలి అనే పేరుతో కులగణన వ్యతిరేకించడం సరైనది కాదు. దేశంలో 95శాతం పెళ్లిళ్లు ఒకే కులంలో జరుగుతున్నాయి.ఇక కులం ఎక్కడ లేదు? మనకు ఇష్టమున్నా లేకపోయినా కులం అనేది భారత్‌లో ఒక వాస్తవం ప్రభుత్వ విధానాల్లో,రాజకీయ వ్యవస్థలో, సామాజిక జీవనంలో కులం ఉంది.కులగణన వల్ల కులభావం పెరుగుతుందనే వాదన సరైనది కాదు.తాము నష్టపోతామని భావించేవారు,తమ అధికారానికి,రాజకీయ ఆధిపత్యానికి గండిపడుతుందనుకునేవారు మాత్రమే కులగణను వ్యతిరేకిస్తున్నారని అర్ధం చేసుకోవచ్చు.కులగణనను సమర్ధించడం ప్రగతిశీల ఆలోచన.ఎన్నికల్లో సీట్ల కేటాయింపు మొదలుకుని,అన్ని వ్యవహారాలూ భారత్‌లో కులం ఆధారంగానే జరుగుతున్నాయి.కులమే అన్ని నిర్ణయాలకూ ప్రాతిపదిక అవుతోంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అందరికీ ఒకేలా అమలవుతున్నాయా? దళితులు,ఆదివాసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కుతోందా? వెనకబడిన వర్గాలకు తగ్గ ఫలితం లభిస్తోందా? వంటి అంశాలు పరిశీలిస్తే సమాజంపై కుల ప్రభావం ఏమిటో బట్టబయలవుతుంది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కులగణన జరగకపోయినప్పటికీ అనేకరాష్ట్రాల్లో రిజర్వేషన్ల డిమాండ్లు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి కులగణన వల్ల రిజర్వేషన్ల సమస్య ఏర్పడుతుందన్నవాదనలో పస లేదు.కులగణన వల్ల అన్ని వివరాలూ సమగ్రంగా తెలుస్తాయి. దేశంలోని ప్రతి మనిషీ స్థితిగతులూ అర్ధమవుతాయి.ప్రభుత్వాల విధానాల రూపకల్పనకు ఇది ప్రాతిపదిక అవుతుంది. కులగణన తర్వాత పథకాల అమలుకు సమగ్ర కార్యాచరణను రూపొందించి అమలు చేయవచ్చు.కులగణన అంతిమంగా సమాజాన్ని పురోగమింపచేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.కులగణన అంటే కులాల లెక్కింపుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు.కుల,సామాజిక,ఆర్థిక స్థితిగతులకు ఉన్న సంబంధాన్ని కులగణన సర్వేలో లెక్కిస్తారు.ఇది సామాజిక న్యాయం వైపు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేలా చేస్తుంది.కులగణన వల్ల వెనకబడిన వర్గాల ఐక్యత దెబ్బతింటుందన్న వాదన అవగాహన లేమితో కూడుకున్నది.
కులగణన సామాజిక ఐక్యతను దెబ్బతీస్తుందని గతంలో బీజేపీ వాదించింది.దేశంలో బీసీలు, ఇతర కులాల సంఖ్య నిర్దుష్టంగా తెలియకపోవడంతో కులగణన చేయాలనే డిమాండ్ చాలాకాలంగా బీసీ సంఘాల నుంచి వస్తోంది.కులగణన వల్ల రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతుందన్నది నిజమే.తాము అధికారంలోకొస్తే 50శాతం పరిమితిని సవరించి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ చెబుతున్నారు.జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేస్తామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులసర్వే జరిపింది. సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయ,కుల సర్వే పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం నిర్వహించడంతో ఆయన ఏ విషయంలో ‘చాంపియన్’ గా గుర్తింపు పొందారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ కులసర్వేకు ప్రయత్నాలు జరిగాయిగానీ కార్యరూపం దాల్చలేదు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.కులసర్వే చేస్తామని 2023లో అప్పటి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది జరగలేదు.