Supreme Court: అక్రమ కాలనీలు ‘పట్టణాభివృద్ధి’కి ముప్పు!

పుట్టగొడుగుల్లా అక్రమ కాలనీలు వెలుస్తుండడం వల్ల పట్టణాభివృద్ధికి ముప్పు కలుగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

  • Written By:
  • Publish Date - April 26, 2022 / 12:58 PM IST

దేశంలోని నగరాల్లో పుట్టగొడుగుల్లా అక్రమ కాలనీలు వెలుస్తుండడం వల్ల పట్టణాభివృద్ధికి ముప్పు కలుగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాటిని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర కార్యాచరణ ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాల(ఎల్‌ఆర్‌ఎస్)ను సవాలు చేస్తూ తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త జువ్వాడి సాగర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర రావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అక్రమ కాలనీలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర్‌నారాయణన్‌ను కోర్టు సహాయకుడు (అమికస్ క్యూరీ) గా నియమించింది.

హైదరాబాద్, కేరళలలో వరదలకు అక్రమంగా వెలసిన కాలనీలే కారణమని ధర్మాసనం చెప్పింది. అక్రమ కాలనీల కట్టడికి సమగ్ర కార్యాచరణ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈదిశగా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలిస్తామని తెలిపింది. ఈ అంశంపై రెండు వారాల్లోగా అమికస్ క్యూరీ సిఫారసులు అందజేస్తారని ధర్మాసనం వెల్లడించింది. సమాచార సేకరణ కు అవసరమైన ఒక ప్రశ్నావళిని రూపొందించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించాలని అమికస్ క్యూరీ కి నిర్దేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. కాగా, ఎల్‌ఆర్‌ఎస్ వంటి పథకాల వల్ల రియల్ ఎస్టేట్ మాఫియా కు ప్రభుత్వాల అండ లభించినట్లు అవుతోందని పిటిషనర్ జువ్వాడి సాగర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ లోనూ మరిన్ని అక్రమ కాలనీలు ఏర్పడటానికి ఇది దోహదం చేస్తుందన్నారు. ఈవిధమైన అక్రమ కాలనీల వల్లే హైదరాబాద్, వరంగల్ నగరాలను గత వర్షాకాలంలో వరదలు ముంచెత్తాయని పిటిషనర్ గుర్తుచేశారు.