Jr.NTR : జూనియ‌ర్ టీ‘ఢీ’పీ.!`కుప్పం` పోస్ట్ మార్టం.!!

జూనియ‌ర్ ఎన్టీఆర్ చుట్టూ అస‌లు ఏం జ‌రుగుతోంది? ఆయ‌నకు తెలియ‌కుండా అన్నీ జ‌రిగిపోతున్నాయా? లేక కుట్ర‌పూరితంగా ఎవ‌రైనా ఆయ‌న్ను పొలిటిక‌ల్ ఎలిమినేష‌న్ వైపు తీసుకెళుతున్నారా?

  • Written By:
  • Updated On - November 29, 2021 / 04:16 PM IST

జూనియ‌ర్ ఎన్టీఆర్ చుట్టూ అస‌లు ఏం జ‌రుగుతోంది? ఆయ‌నకు తెలియ‌కుండా అన్నీ జ‌రిగిపోతున్నాయా? లేక కుట్ర‌పూరితంగా ఎవ‌రైనా ఆయ‌న్ను పొలిటిక‌ల్ ఎలిమినేష‌న్ వైపు తీసుకెళుతున్నారా? అనే ప్ర‌శ్న‌లు చిత్తూరు జిల్లా కుప్పం కేంద్రంగా వినిపిస్తున్నాయి. కుప్పం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవ‌డానికి జూనియ‌ర్ అభిమానులు కార‌ణ‌మ‌ని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలోని ఒక గ్రూప్ న‌మ్ముతోందట‌.రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఒక ఎత్తు అయితే, కుప్పం మ‌రో ఎత్తుగా నిలిచింది. చంద్ర‌బాబు సొంత అడ్డాగా పేరున్న కుప్పం ఓట‌మిపై టీడీపీ అధ్య‌య‌నం చేసింది. ప్ర‌ధానంగా వైసీపీ దొంగ ఓట్లు, రిగ్గింగ్ కార‌ణాలు కాగా, స్వ‌ల్ప మోజార్టీతో ఓడిపోయిన వార్డుల్లో జూనియ‌ర్ అభిమానులు స‌హ‌క‌రించ‌లేద‌ని భావిస్తోంది. సాధార‌ణంగా చంద్ర‌బాబు కుప్పం ఎప్పుడు వెళ్లినా, ఎన్టీఆర్ ఫ్లెక్సీల‌ను అభిమానులు ప్ర‌ద‌ర్శింటారు. అంతేకాదు, జూనియ‌ర్ ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కీల‌కం చేయాల‌ని డిమాండ్ చేయ‌డం త‌ర‌చూ వినిపిస్తోంది. ఒకానొక స‌మ‌యంలో వాళ్లు చేస్తోన్న డిమాండ్ చంద్ర‌బాబును సైతం ఉక్కిబిక్కిరి చేసింద‌ట‌.

స్థానిక ఎన్నిక‌ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బ‌హిష్క‌రించింది. కొన్ని చోట్ల స్థానిక నేత‌ల అభీష్టానికి వ‌దిలేసింది. కేవ‌లం 12 చోట్ల మాత్రం కోర్టుల్లో కేసులు కార‌ణంగా ఎన్నిక‌ల నిలిచిపోయాయి. వాటికి కోర్టు క్రియ‌రెన్స్ ఇచ్చిన త‌రువాత ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. ఆ 12 ప్రాంతాల్లో కుప్పం ఒక‌టి. రాష్ట్రంలో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రిగిన మాదిరిగా సీరియ‌స్ గా అక్కడి పోలింగ్ జ‌రిగింది. చంద్ర‌బాబునాయుడు త‌న స‌త్తా చాట‌డానికి లోకేష్ ఆధ్వ‌ర్యంలో ఒక క‌మిటీని అక్క‌డ‌కు పంపించాడు. ఆ రోజు నుంచే జూనియ‌ర్ అభిమానులు కుప్పం ఎన్నిక‌ల్లో చురుగ్గా పాల్గొన‌లేద‌ని టీడీపీలోని లోకేష్ గ్రూప్ భావిస్తోంద‌ట‌. అందుకే, ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నార‌ని కుప్పం టీడీపీలోని టాక్‌.

అసెంబ్లీ వేదిక‌గా భువ‌నేశ్వ‌రి శీలం మీద వైసీపీ చేసిన కామెంట్లు చంద్ర‌బాబును బోరున విల‌పించేలా చేశాయి. ఆ సంద‌ర్భంగా వైసీపీ నేత‌ల‌ను నంద‌మూరి ఫ్యామిలీ టార్గెట్ చేసి మాట్లాడింది. కానీ, జూనియ‌ర్ ఇచ్చిన రిప్లై బాగాలేద‌ని టీడీపీలోని ఒక గ్రూప్ ఆయ‌న్ను బ‌ద్నాం చేసింది. పార్టీలోని సీనియ‌ర్లు వ‌ర్ల రామ‌య్య‌, బుద్ధా వెంక‌న్న కూడా మీడియా ముఖంగా దాడి చేశారు. దీంతో జూనియ‌ర్ అభిమానులు వాళ్ల మీద తిర‌గ‌బడ్డారు. తాజాగా కుప్పం కేంద్రంగా ధ‌ర్నాకు దిగడం పార్టీలోని జూనియ‌ర్ వ్య‌తిరేక గ్రూప్ కు అంతుబ‌ట్ట‌డంలేదు.కుప్పం ధ‌ర్నా వ‌ర‌కు ఎన్టీఆర్ అభిమానులు ప‌రిమితం అవుతారా? లేక రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఆందోళ‌న చేస్తారా? అనేది ఇప్పుడు పార్టీలోని ఆయ‌న వ్య‌తిరేక గ్రూప్ చ‌ర్చించుకుంటోంది. ఇదంతా తెర వెనుక ఎవ‌రో న‌డిపిస్తోన్న నాట‌కంగా సీనియ‌ర్లు కొంద‌రు భావిస్తున్నారు. చంద్ర‌బాబు నేరుగా రంగంలోకి దిగి ఫుల్ స్టాప్ పెట్ట‌క‌పోతో, జూనియ‌ర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలోనే బీ గ్రూప్ గా త‌యారు అయ్యే ప్ర‌మాదం లేక‌పోలేదు.