KCR Politics : ఔను! వాళ్లిద్ద‌రూ చెరోదారి!!

న‌మ్మ‌కం కోసం జీవితాంతం పోరాడాలి. దాన్ని పోగొట్టుకోవ‌డానికి ఒక సంఘ‌ట‌న చాలు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయ అడుగుల‌ను విశ్వ‌సించ‌డానికి జాతీయ పార్టీలు జంకుతున్నాయి.

  • Written By:
  • Updated On - December 15, 2021 / 12:48 PM IST

న‌మ్మ‌కం కోసం జీవితాంతం పోరాడాలి. దాన్ని పోగొట్టుకోవ‌డానికి ఒక సంఘ‌ట‌న చాలు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయ అడుగుల‌ను విశ్వ‌సించ‌డానికి జాతీయ పార్టీలు జంకుతున్నాయి. అంతేకాదు, వివిధ రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖ పార్టీల అధిప‌తులు కూడా వెన‌క్కు త‌గ్గుతున్నారు. సీఎం హోదాలో ఏ రాష్ట్రానికి వెళ్లిన‌ప్ప‌టికీ సాద‌రంగా ఆహ్వానిస్తున్నారు. కానీ, రాజ‌కీయ కోణం నుంచి ఆలోచించిన‌ప్పుడు ఆయ‌న్ను విశ్వాసంలోకి తీసుకోలేక‌పోతున్నార‌ని టాక్‌. స‌రిగ్గా ఇలాంటి ప‌రిణామ‌మే త‌మిళనాడు సీఎం స్టాలిన్ ను క‌లిసిన‌ప్పుడు కేసీఆర్ కు అనుభ‌వం అయింద‌ట‌.

త‌మిళ‌నాడుకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ అక్క‌డి సీఎం స్టాలిన్ తో దాదాపు గంట పాటు ఏకాంతంగా గ‌డిపాడు. ఆ స‌మ‌యంలో ద‌క్షిణ భార‌త‌దేశానికి జ‌రుగుతోన్న అన్యాయం గురించి చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు అధికారిక స‌మాచారం. కానీ, వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింద‌ని త‌మిళ‌నాడు వ‌ర్గాల టాక్‌. బీజేపీ, కాంగ్రెసేత‌ర ఫ్రంట్ ను స్టాలిన్ ముందు ఉంచిన‌ప్పుడు ఆయ‌న నుంచి వ‌చ్చిన స్పంద‌న సానుకూలంగా రాలేద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలే అనుకుంటున్నాయి.కాంగ్రెస్‌తో కూడిన యూపీఏ ప్ర‌ధాన భాగ‌స్వామి డీఎంకే పార్టీ. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌తో క‌లిసి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు స్టాలిన్ వెళ్లాడు. పైగా క‌రుణానిధి హ‌యాం నుంచి కాంగ్రెస్ పార్టీతో క‌లివిడిగా ఆ పార్టీ నాయ‌కులు ఉంటున్నారు. యూపీఏతో సుదీర్ఘ కాలం డీఎంకే ప్ర‌యాణం చేసింది. ఆ స‌మ‌యంలో డీఎంకే లీడ‌ర్లు క‌నిమొలి, రాజాల‌ను అరెస్ట్ చేయ‌డం కూడా జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ సోనియా కుటుంబానికి, క‌రుణానిధి ఫ్యామిలీకి ఏ మాత్రం తేడా రాలేదు. రాజ‌కీయంగా ఇద్ద‌రూ క‌లిసి వెళుతున్నారు.

ప్ర‌త్యేక తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తాన‌ని సోనియాను నిండా ముంచాడు కేసీఆర్‌. ఆ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్లు ఇప్ప‌టికీ అనే వేదిక‌ల‌పైన చెబుతుంటారు. తెలంగాణ ఇవ్వ‌డానికి రాజ‌కీయ ప‌ర‌మైన నిర్ణయాన్ని ఆనాడు సోనియా చాలా బ‌లంగా తీసుకుంది. ఏపీ లీడ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆమె మాట మీద నిల‌బ‌డింది. పార్టీ రాజ‌కీయంగా న‌ష్ట‌పోతుంద‌ని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా పార్ల‌మెంట్ త‌లుపులు వేసి ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తార‌ని న‌మ్మింది. సీన్ క‌ట్ చేస్తే, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ‌లో లేకుండా చేసేలా కేసీఆర్ ప్లాన్ చేశాడు.ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ ఆడిన గేమ్ దేశ వ్యాప్తంగా అన్ని పార్టీల అధిప‌తులకు తెలుసు. అందుకే, బీజేపీ అధిష్టానం కూడా కేసీఆర్ విష‌యంలో ఆచితూచి గేమ్ ఆడుతోంది. యూపీఏ భాగ‌స్వామ్య పార్టీల అధిప‌తులు కూడా జాగ్ర‌త్త‌గా మెలుగుతుంటారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ ప‌లు రాష్ట్రాల‌కు వెళ్లిన‌ప్ప‌టికీ ఆశించిన స్పంద‌న రావ‌డంలేదు. అందుకే, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు హ‌డావుడి చేసిన కేసీఆర్ చ‌ప్పుడు చేయ‌కుండా ఉన్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ అదే ప్ర‌య‌త్నాన్ని మొద‌లుపెట్టాడు. ఆ క్ర‌మంలో స్టాలిన్ మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ తొలి ప్ర‌య‌త్నంలోనే బెడిసి కొట్టిందని టాక్. సో..కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఎండ‌మావిగానే క‌నిపిస్తోంది. ఇక తెలంగాణ ప్ర‌జ‌ల న‌మ్మ‌కం మాత్ర‌మే ఆయ‌న‌కు మిగిలింది. రాబోవు ఎన్నిక‌ల్లో వాళ్లు కూడా న‌మ్మ‌కాన్ని వీడితే, ఇక ఫాంహౌస్ కు ప‌రిమితం కావ‌ల్సిందే.!