బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ చెక్ పేరుతో ఓ కొరియా మహిళపై లైంగిక దాడికి పాల్పడిన గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల భద్రతకే ముప్పు కలిగించిన ఈ ఘటన కలకలం రేపింది.
- బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొరియా మహిళపై లైంగిక వేధింపులు
- లగేజీలో బీప్ సౌండ్ వస్తోందని నమ్మించి పక్కకు తీసుకెళ్లిన నిందితుడు
- మహిళ ఫిర్యాదుతో నిందితుడైన గ్రౌండ్ స్టాఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి దారుణం రికార్డ్
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 19న ఓ కొరియా మహిళ తన స్వదేశానికి వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తి చేసుకుని టెర్మినల్ వైపు వెళ్తుండగా, ఎయిర్ ఇండియా శాట్స్ గ్రౌండ్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న మహమ్మద్ అఫాన్ అనే ఉద్యోగి ఆమెను అడ్డగించాడు. ఆమె ఫ్లైట్ టికెట్ పరిశీలించి, చెక్-ఇన్ లగేజీ నుంచి బీప్ సౌండ్ వస్తోందని, సమస్య ఉందని చెప్పాడు.
తిరిగి స్క్రీనింగ్ కౌంటర్‌కు వెళితే విమానం మిస్సయ్యే ప్రమాదం ఉందని, తాను ప్రత్యేకంగా తనిఖీ చేస్తానని నమ్మించాడు. అనంతరం ఆమెను పురుషుల వాష్‌రూమ్ సమీపంలోకి తీసుకెళ్లి, అభ్యంతరాలు పెడుతున్నా వినకుండా అసభ్యంగా తాకాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను కౌగిలించుకుని, ‘థ్యాంక్యూ’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ ఘటనతో షాక్‌కు గురైన ఆ మహిళ వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, అఫాన్ దారుణ ప్రవర్తన స్పష్టంగా రికార్డయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
