Drugs Death: నాగేంద్రన్ ధర్మలింగానికి ఉరి.. ఫలించని 11 ఏళ్ల న్యాయ పోరాటం

సింగపూర్ లో ఉండే కఠిన చట్టాల వల్ల భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష తప్పలేదు. 11 ఏళ్లపాటు పోరాడినా సరే.. సింగపూర్ న్యాయవ్యవస్థ తన మాట మీదే కట్టుబడి ఉంది.

  • Written By:
  • Publish Date - April 28, 2022 / 09:07 AM IST

సింగపూర్ లో ఉండే కఠిన చట్టాల వల్ల భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష తప్పలేదు. 11 ఏళ్లపాటు పోరాడినా సరే.. సింగపూర్ న్యాయవ్యవస్థ తన మాట మీదే కట్టుబడి ఉంది. కనీసం ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చండని అంతర్జాతీయ సమాజం వేడుకున్నా ఫలితం లేకపోయింది. తన కొడుకు మానసికంగా ఆరోగ్యంగా లేడని.. కనికరించాలని.. ఆ నిందితుడి తల్లి న్యాయమూర్తులను ప్రాధేయపడినా ఉరిశిక్ష ఆగలేదు. దీంతో 34 ఏళ్ల నాగేంద్రన్ కె.ధర్మలింగానికి సింగపూర్ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. దీంతో యావత్ అంతర్జాతీయ సమాజం ఆవేదన చెందింది.

నాగేంద్రన్ సింగపూర్ లో నివసించేవాడు. 2009లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. 42.72 గ్రాముల హెరాయిన్ ను అక్రమ రవాణా చేశాడన్నది ఆయపై ఉన్న అభియోగం. అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం 2010లోనే ఉరిశిక్షను అమలు చేయడానికి సిద్ధపడింది. కానీ అప్పటికే నాగేంద్రన్ మానసిక సమస్యలతో బాధపడేవాడు. అందుకే ఆయన ఉరిశిక్షను రద్దు చేయాలని.. మానవహక్కుల సంఘాలు పెద్ద ఎత్తువ ఉద్యమించాయి. సింగపూర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

ఈ పోరాటంపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది. తన ప్రియురాలిని చంపేస్తామంటూ నాగేంద్రన్ ను కొందరు బెదిరించారని.. అందుకే అతడు డ్రగ్స్ సరఫరా చేశాడని.. దీనివల్ల ఆయనకు ఉరిశిక్ష నుంచి విముక్తి ప్రసాదించాలని కోర్టుకు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. నాగేంద్రన్ ఉరిశిక్షను రద్దు చేయాలంటూ కిందటేడాది అక్టోబర్ 29న ఆన్ లైన్ లో 56,134 మంది ఓ పిటిషన్ పై సంతకాలు చేశారు. నాగేంద్రన్ ను కాపాడడానికి ఎన్ని విధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

నాగేంద్రన్ మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నాడని.. అప్పులు తీర్చడానికే ఈ డ్రగ్స్ సరఫరా మార్గాన్ని ఎంచుకున్నాడని హైకోర్టు, అప్పీల్ కోర్టులు అభిప్రాయపడ్డాయి. క్షమాభిక్ష కోసం అధ్యక్షుడికి దరఖాస్తు చేసినా అది తిరస్కరణకు గురైంది. దీంతో కిందటేడాది నవంబర్ 10నే నాగేంద్రన్ కు ఉరిశిక్షను అమలు చేయాలని కోర్టు చెప్పింది. కానీ అప్పుడు ఆయన కరోనా బారిన పడడం, ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడంతో శిక్ష అమలు కాలేదు. ఇప్పుడు కూడా సోమవారం నాడు తాజాగా ఓ పిటిషన్ ను దాఖలు చేసినా సరే.. దానిని కోర్టు విచారణకు స్వీకరించలేదు. ఉరిశిక్ష అమలుకు రెండు రోజుల ముందు ఇలాంటి పిటిషన్ ను స్వీకరించలేమని చెప్పేసింది. చివరకు 11 ఏళ్ల పోరాటం ముగిసింది. నాగేంద్రన్ ను బుధవారం నాడు ఉరి తీశారు.