Site icon HashtagU Telugu

దుమారం రేపుతోన్న మోడీ బొమ్మ..కేర‌ళ హైకోర్టులో పిటిష‌న్

ప్ర‌జా ధ‌నంతో ప్ర‌చారం చేసుకోవ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏ మాత్రం పోటీప‌డుతున్నాయి. వ్య‌క్తిగ‌త ప్ర‌చార ఆర్భాటం కోసం ప్ర‌ధాని మోడీ ముందు వ‌రుస‌లో ఉన్నాడు. కోవిడ్ -19 వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్‌ను కూడా ఆయ‌న వ‌ద‌ల‌లేదు. దాని మీద ఆయ‌న ఫోటో ఉండేలా చూసుకున్నాడు. ప్ర‌జాధ‌నంతో వేసిన వ్యాక్సిన్ల‌కు మోడీ బొమ్మ తో కూడిన స‌ర్టిఫికేట్ జారీ చేయ‌డం ప్రాథ‌మిక హ‌క్కుల ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ట‌. అంతేకాదు, వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను ఈ స‌ర్టిఫికేట్ ద్వారా హరించి వేస్తున్నాడ‌ట‌. ఎలాంటి ఉప‌యోగంలేని ఈ స‌ర్టిఫికేట్ జారీ ఎందుకంటూ నిల‌దీస్తున్నాడు కేర‌ళ‌ రాష్ట్రానికి చెందిన పీటర్. అంతేకాదు, కేర‌ళ హైకోర్టులో పిటిష‌న్ కూడా వేశాడు. కేంద్రానికి హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది.

కోవిడ్ -19 పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ను గుల్ల చేసింది. వాళ్ల‌ను ఆదుకోవ‌డంలో కేంద్ర‌, రాష్ట్రాలు వైఫ‌ల్యం చెందాయి. వ్యాక్సినేష‌న్ అంశంలోనూ ఆ వ‌ర్గాల‌కు అన్యాయం చేస్తున్నారు. ప‌బ్లిక్, ప్రైవేటు గా వ్యాక్సినేష‌న్ల‌ను వేస్తున్నారు. ఉచితంగా అంద‌రికీ అందించాల్సిన వ్యాక్సిన్ల‌ను ప్రైవేటు ఆస్ప‌త్రుల ద్వారా అమ్ముకోవ‌డం ప్ర‌భుత్వాల‌కు సిగ్గుచేటు. ఇదంతా ఒక ఎత్తు అయితే..వ్యాక్సినేష‌న్ అయిన ప్ర‌తి వారి ద‌గ్గ‌ర‌ స‌ర్టిఫికేట్ ఉండాల‌నే నిబంధ‌న పెట్టారు. ఆ స‌ర్టిఫికేట్ లేక‌పోతే కొన్ని చోట్ల‌కు అనుమ‌తించ‌డంలేదు. విమాన‌, రైల్వే ప్ర‌యాణాలు, విద్యార్థుల ప‌రీక్ష‌ల‌కు త‌ప్ప‌న‌స‌రి చేస్తున్నారు. దీంతో స‌ర్టిఫికేట్ ను తీసువాల్సిన అవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది.


స‌ర్టిఫికేట్ మీద మోడీ బొమ్మ‌, ఆయ‌న ఇచ్చే మెసేజ్ ప్రింట్ వేసి ఉన్నాయి. విదేశాల‌కు వెళ్లే వాళ్ల‌కు ఆ బొమ్మ‌, మెసేజ్ తో కూడిన స‌ర్టిఫికేట్ అవ‌మానాల‌కు దారితీస్తోంది. ప్ర‌పంచంలోని ఏ ఇత‌ర దేశాల్లో లేని విధంగా భార‌త్ లో ఈ స‌ర్టిఫిరేట్ ఏంటి అంటూ అనుమానిస్తున్నారు. పైగా వ్యాక్సినేష‌న్ వేయించుకున్న వాళ్ల‌కు స‌ర్టిఫికేట్ ఎందుకో..అర్థం కావ‌డంలేదు. వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ల‌కు అవ‌గాహ‌న క‌లిగించాలి. కానీ, వ్యాక్సినేష‌న్ అయిన వాళ్ల‌కు ఈస‌ర్టిఫికేట్ తో ఎలాంటి ఉప‌యోగం లేదు. డ‌బ్బు క‌ట్టి వ్యాక్సిన్ వేయించుకుని మోడీ బొమ్మ తో కూడిన మెసేజ్ ను ఎందుకు తీసుకోవాల‌ని కేర‌ళ‌కు చెందిన పీట‌ర్ వేస్తోన్న ప్ర‌శ్న‌.

ఇలాంటి వాద‌న‌ల‌తో కూడిన పిటిష‌న్ ను కేర‌ళ హైకోర్టులో పీట‌ర్ దాఖ‌లు ప‌రిచాడు. కేర‌ళ‌లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌గా పీట‌ర్ ప‌ని చేస్తున్నాడు. ప్ర‌జా స‌మాచార హ‌క్కు జాతీయ కో ఆర్డినేట‌ర్ గా ఉన్నాడు. ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం క‌లిగేలా వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్ లో మోడీ బొమ్మ ఉంద‌ని ఆయ‌న వాద‌న. గ‌తంలో అనేక సంద‌ర్భాల‌లో దేశంలో వ్యాక్సిన్ లు వేశారు. టీకాలు ఉచితంగా ప్ర‌భుత్వాలు వేయించాయి. అప్ప‌ట్లో ఎవరూ ఇలాంటి సర్టిఫికేట్ల‌ను తీసుకోవాల‌ని పౌరుల‌కు ఆదేశాలు ఇవ్వ‌లేదు. పైగా ఈ స‌ర్టిఫికేట్ వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగంలేద‌ని పీట‌ర్ వాద‌న‌. మొత్తం ఈ మీద పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు …మోడీ బొమ్మను తొల‌గిస్తే వ‌చ్చే న‌ష్టం ఏమిటో తెలియ‌చేయాల‌ని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. రాజ్య‌స‌భ‌లోనూ దీనిపైన స‌భ్యులుప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్ లో కోవిడ్ -19 జాగ్ర‌త్త‌లు భ‌విష్య‌త్ లోనూ పాటించాల‌నే ఉద్ధేశంతో మోడీ బొమ్మ‌తో కూడిన మెసేజ్ ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి భార‌తీ ప్ర‌వీణ్ ప‌వార్ స‌మాధానం ఇచ్చారు. మొత్తం మీద మోడీ ప్ర‌చారం ఆర్భాటం కేర‌ళ హైకోర్టు, రాజ్య‌స‌భ‌లో వాద‌ప్ర‌తివాద‌న‌ల‌కు కేంద్ర బిందువుగా మారింది.