Site icon HashtagU Telugu

IT Raids : కర్ణాటక రాజకీయాల్లో నోటీసుల కలకలం.. మాజీ ప్రధాని దేవెగౌడ భార్యకు ఐటీ నోటీసులు

Dewegowda Wife

Dewegowda Wife

కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ భగ్గుమన్నాయి. మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ సతీమణి చెన్నమ్మకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. తన పేరుతో ఉన్న ఆస్తికి సంబంధించి ఆదాయ వివరాలను ఇవ్వాలని కోరింది. దీంతో ఈ అంశం.. కర్ణాటక రాజకీయాల్లో దుమారానికి దారితీసింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందని.. దేవెగౌడ కుమారుడు మాజీ మంత్రి అయిన రేవణ్ణ ఆరోపించారు..

దేవెగౌడ భార్య చెన్నమ్మ యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. అయినా సరే తన తల్లిదండ్రులు కోట్ల రూపాయిలు సంపాదించారన్నట్టుగా ఐటీ శాఖ ప్రవర్తిస్తోంది.. ఇదంతా బీజేపీ కుట్రే అని రేవణ్ణ ఆరోపించారు. తన తల్లికి ఉన్న పొలంలో చెరకు సాగు చేపట్టామని.. ఆమె పేరిట ఉన్న ఆస్తికి ఆదాయ మూలాలు కూడా ఉన్నాయని రేవణ్ణ అన్నారు. అయినా సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేవెగౌడ ఏరోజూ డబ్బుకు ఆశపడలేదని వివరించారు.

తాము తండ్రి బాటలోనే నడుస్తున్నామని.. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడబోమని తేల్చి చెప్పారు మాజీ సీఎం, దేవెగౌడ కుమారుడు కుమారస్వామి. అందుకే ఈ విషయం గురించి అనవసరంగా ఆందోళన చెందక్కరలేదని రేవణ్ణకు చెప్పానన్నారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో విపక్ష పార్టీ నేతలకు, వారి కుటుంబీకులకు ఐటీ నోటీసులు అంటే సహజంగానే రాజకీయ దుమారం రేగుతుంది. మరి ఈ ఇష్యూని దేవెగౌడ కుటుంబం ఎలాంటి రాజకీయ అస్త్రంగా మార్చుకుంటుందో చూడాలి.

కర్ణాటకలో విజయంపై ఇప్పటికే బీజేపీ.. ఫోకస్ పెట్టింది. అందుకే ముఖ్యమంత్రి బొమ్మని మారుస్తారని ఆమధ్య టాక్ వచ్చినా.. సుస్థిర ప్రభుత్వం ఉండేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికే ఇలా చేస్తోందన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది. మరి దీనిని కమలనాథులు ఎలా తిప్పికొడతారో చూడాలి.

Exit mobile version