Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

కర్నాటకలో మరో వివాదం రాజుకుంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎయిర్ గన్స్ తో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు త్రిశూల దీక్ష చేస్తున్నట్లు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 05:31 AM IST

కర్నాటకలో మరో వివాదం రాజుకుంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎయిర్ గన్స్ తో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు త్రిశూల దీక్ష చేస్తున్నట్లు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బజరంగ్ దళ్ శిబిరంలో శౌర్య శిక్షణ వర్గ్ పేరుతో కర్నాటకలోని కొడుగు జిల్లా పొన్నంపేటలోని సాయిశంకర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ శిబిరం మే 5 నుంచి 11వరకు సాగినట్లుగా తెలుస్తోంది. దాదాపు 400మంది బజరంగ్ కార్యకర్తలు పాల్గొన్నట్లు సమాచారం. వారికి ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో ఆయుధ శిక్షణ ఇచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు ఆయుధ శిక్షణపై విపక్షాల నుంచి భారీ ఎత్తున విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కొడుగు జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు పలువురిపై ఆరోపణలు చేసింది. అయితే ఆత్మరక్షణ కోసం ఈ మేరకు శిక్షణ ఇస్తున్నట్లుగా బజరంగ్ దళ్ పేర్కొంది. ఆయుధ శిక్షణపై విమర్శలు తలెత్తడంతో ఆయుధాలు ఇవ్వలేదని…పాఠశాల ప్రాంగణాన్ని చాలా ఏళ్లుగా శిక్షన తరగతులకు ఉపయోగిస్తున్నారని…వారికి ట్రైనింగ్ పై అవగాహన లేదని సంబంధిత సంస్థ నిర్వాహకులు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేశారు.
ఇక తమిళనాడు, గోవా, పుదుచ్చేరి వ్యవహారాల AICCఇన్ చార్జీ దినేశ్ గుండూరావు ట్వీట్ చేశారు. బజరంగ్ దళ్ సభ్యులకు ఆయుధ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నారు…ఎటువంటి లైసెన్స్ లేకుండా తుపాకులతో శిక్షణ ఇవ్వడం నేరం కాదా అని ప్రశ్నించారు. ఆయుధ చట్టం 1959, ఆయుధ నియమాలు, 1962 ఉల్లంఘన కాదా మరి ఈ కార్యకలాపంలో బీజేపీ నేతలు ఎందుకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ట్వీట్ చేశారు. యువత తమ కలలను నెరవేర్చుకోవడంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారని, కానీ.. కర్నాటకలోని బజరంగ్ దళ్ మాత్రం మతం పేరుతో హింసను వ్యాప్తి చేసేలా శిక్షణ ఇస్తుందని మండిపడ్డారు. ఈ విషయమై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై విమర్శలు భారీ ఎత్తున్న వెల్లువెత్త‌డంతో బజరంగ్‌ దళ్‌ స్పందించింది. ఆత్మరక్షణ కోసమే తమ కార్యకర్తలకు ఈ శిక్షణ ఇచ్చినట్లు బజరంగ్‌ దళ్‌ నేత రఘు సకలేష్‌పూర్ వివ‌రించారు. శిక్షణకు వినియోగించిన ఎయిర్‌ పిస్టళ్లు, త్రిశూలాలు ఆయుధ చట్టం ఉల్లంఘటన కిందకు రావని ఆయన చెప్పారు. ఈ శిబిరంలో వెయిట్ లిప్టింగ్ , లాంగ్‌ జంప్‌, మంకీ రోప్‌ వంటి క్రీడ‌ల్లో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.