Suresh Gopi : మంత్రి పదవికి రాజీనామా చేయను.. అవన్నీ తప్పుడు వార్తలు : సురేష్ గోపి

కేరళకు చెందిన ప్రముఖ నటుడు, ఇటీవల బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన సురేష్ గోపి ఆదివారం రోజు కేంద్ర మంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Sureshgopi

Sureshgopi

Suresh Gopi : కేరళకు చెందిన ప్రముఖ నటుడు, ఇటీవల బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన సురేష్ గోపి ఆదివారం రోజు కేంద్ర మంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సోమవారం రోజు ఆయన మంత్రి పదవి విషయమై రకరకాల ప్రచారాలు జరిగాయి. మంత్రి పదవిలో కొనసాగడం సురేష్ గోపికి ఇష్టం లేదని.. త్వరలోనే ఆయన రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. పలు ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ వార్తలను ప్రధానంగా ప్రచురించాయి. ఈనేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సురేష్ గోపి స్పందించారు. ఆ వార్తలన్నీ అబద్ధాలని.. వాటిలో ఏమాత్రం వాస్తవికత లేదని ఆయన స్పష్టం చేశారు. తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం లేదని సురేష్ గోపి(Suresh Gopi) తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ సారథ్యంలో కేంద్ర మంత్రి హోదాలో దేశానికి, కేరళకు సేవలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు.  బీజేపీ అధిష్టానం తనకు ఏ అవకాశం ఇచ్చినా.. దాన్ని వినియోగించుకొని కేరళ అభివృద్ధి కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తానని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘ఇప్పటికే ఒప్పందాలు కుదిరిన సినిమాల కోసం నేను మంత్రి పదవిని వదులుకోను. నన్ను గెలిపించిన త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతీ అవకాశాన్ని వాడుకోవాల్సి ఉంటుంది’’ అని సురేష్ గోపి చెప్పారు. కేరళలో లోక్‌సభ స్థానాన్ని బీజేపీ గెల్చుకోవడం ఇదే తొలిసారి. అందుకే అక్కడి నుంచి గెలిచిన నటుడు సురేష్ గోపికి కేంద్ర క్యాబినెట్‌లో ప్రధాని మోడీ అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో త్రిసూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సురేష్ గోపి 74,686 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.గత రెండు పర్యాయాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ సంఖ్యలో ఎంపీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ప్రత్యేకించి ఈసారి బీజేపీకి మెజారిటీ లేకపోడంతో.. ఎన్డీయే మిత్రపక్ష పార్టీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు.

Also Read : Assembly Elections : త్వరలో ‘మహా’ మార్పు.. అసెంబ్లీ పోల్స్‌కు రెడీ కండి : శరద్ పవార్

  Last Updated: 10 Jun 2024, 04:00 PM IST