Site icon HashtagU Telugu

Hijab Controversy: హిజాబ్ వివాదం పై.. సుప్రీం స్పంద‌న‌ ఎలా ఉంటుందో..?

Supreme Court Of India Hijab Controversy

Supreme Court Of India Hijab Controversy

కర్ణాటక హిజాబ్​ వివాదం ఇప్ప‌ట్లో ముగిసేలా క‌నిపించ‌డంలేదు. హిజాబ్ వివాదం పై మంగ‌ళ‌వారం క‌ర్నాట‌క‌ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. విద్యా సంస్థ‌ల్లో హిజాబ్ త‌ప్ప‌ని స‌రికాద‌ని స్ప‌ష్టం చేసిన హైకోర్టు, హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని ధర్మాసనం పేర్కొంది. హిజాబ్ విషయంలో క‌ర్నాట‌క‌ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు స‌మ‌ర్థించింది. ఈ క్ర‌మంలోవిద్యా సంస్థల ప్రోటోకాల్స్‌ను విద్యార్ధులు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఈ క్ర‌మంలో స్కూళ్లు, కాలేజీలు, ఇత‌ర విద్యా సంస్థ‌ల్లో హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేప‌ధ్యంలో హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. హిజాబ్ తప్పనిసరి కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్లు. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాలు చేస్తూ, సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది.

హిజాబ్ వివాదం పై తాజాగా క‌ర్నాట‌క హైకోర్టు ఇచ్చిన తీర్పుతో షాక్ అయిన ముస్లిం అమ్మాయిలు ఉడిపి ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడాల‌రు. ఈ క్ర‌మంలో హిజాబ్ వేసుకోవ‌డం మా ఆచారం అని ముస్లిం విద్యార్థినులు అన్నారు. త‌మ‌కు విద్య‌తో పాటు హిజాబ్ వేసుకోవ‌డం కూడా ముఖ్య‌మని, మాకు రెండూ కావాల‌న్నారు. కొన్ని వేల మంది ముస్లీం విద్యార్థినులు హిజాబ్ ధ‌రించి స్కూల్స్ అండ్ కాలేజ్‌ల‌కు వెల‌తామ‌ని, పరీక్షలు రాస్తామని అంటున్నారని వారు చెప్పారు. ఇక మంగ‌ళ‌వార‌మే కర్ణాటకకు చెందిన నిబా నాజ్ అనే ముస్లిం అమ్మాయి తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇక కర్ణాటక విద్యా సంస్థ‌ల్లో ముస్లీం విద్యార్థినులు హిజాబ్​ ధరించడం ఇటీవల వివాదంగా మారింది. దీనిని వ్యతిరేకిస్తూ కొన్ని విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు హిజాబ్ తొలగించి రావాలని సూచించడంతో, ఈ హిజాబ్ వివాదం మరింత ముదిరింది. ఎంత‌లా అంటే స్కూళ్ళు, కాలేజీల్లోని విద్యార్థులు మధ్య గొడవలకు కూడా దారి తీసింది. హిజాబ్​కు వ్యతిరేకంగా హిందూ విద్యార్థులు కాషాయపు కండువా కప్పుకుని క్లాస్​లకు రావడం ప్రారంభించారు. దీంతో విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసేసి 144 సెక్షన్ పెట్టేంత వరకు వెళ్లింది. తిరిగి విద్యా సంస్థలు ప్రారంభమైనా కట్టుదిట్టమైన భద్రత నడుమే తరగతులు జరిగాయి.

ఈ వివాదంపై ఇరు పక్షాలు కోర్టు మెట్లె ఎక్క‌గా, కోర్టులో ఇరు వ‌ర్గాల వాదనలు విన్న ధ‌ర్మాస‌నం తాజాగా విద్యార్థులు హిజాబ్​ ధరించడం తప్పనిసరి కాదని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈ హిజాబ్ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. ఇక గ‌తంలో క‌ర్ణాట‌క హైకోర్టులో విచార‌ణ‌కు ముందే కొంత‌మంది ముస్లిం విద్యార్థినులు ఈ హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. అయితే అప్పుడు వారి పిటిష‌న్స్‌ను విచారించ‌డానికి నిరాక‌రించిన‌ సుప్రీం, క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పు కోసం వేచి చూడాల‌ని పిటిష‌న‌ర్ల‌కు సూచించింది సుప్రీం కోర్టు. ఈ క్ర‌మంలో ఇప్పుడు హిజాబ్ వివాదం పై క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పు ఏకంగా ధ‌ర్మాస‌నం ద్వారానే వెల్ల‌డి అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇలాంటి నేప‌థ్యంలో హిజాబ్ వివాదంపై దాఖ‌లైన పిటీష‌న్ పై సుప్రీం కోర్టు ఏం చెబుతుందో చూడాలి.