Site icon HashtagU Telugu

Murder: మూలికా వైద్యం రహస్య ఫార్ములా కోసం హత్య.. కత్తిపీటలతో ముక్కలు చేసి, ఐదు సంచుల్లో పెట్టి నదిలో పారేశారు!!

Healer Murder

Healer Murder

కామెర్ల చికిత్సకు వాడే మూలికా వైద్యానికి సంబంధించిన సీక్రెట్ ఫార్ములా ఒక వ్యక్తి దారుణ హత్యకు కారణమైంది. ఈ ఘటన కేరళలోని వయనాడ్ పరిధిలో చోటుచేసుకుంది. గత కొన్ని దశాబ్దాలుగా మైసూరులోని వసంత్ నగర్ లో ఉన్న తన ఇంట్లో మూలికా వైద్యాన్ని అందించే 60 ఏళ్ల షాబా షరీఫ్ 2019 ఆగస్టు 2 న కనిపించకుండా పోయారు. దీనికి సంబంధించిన మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయగా దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. షాబా షరీఫ్ ను కేరళలోని నీలంపూర్ కు చెందిన షైబిన్ అష్రాఫ్ కిడ్నాప్ చేయించాడని తేలింది. దాదాపు 11 నెలల పాటు తన ఇంట్లోనే కట్టేసి ఉంచి.. మూలికా వైద్యం సీక్రెట్ ఫార్ములా చెప్పాలంటూ షాబా షరీఫ్ ను చిత్రహింసలు పెట్టినట్లు గుర్తించారు. ఔషధ ఫార్ములాను చెప్పేటందుకు షాబా షరీఫ్ ససేమిరా అనడంతో.. చివరకు ఒక ముఠా సాయంతో 2020 అక్టోబరులో అతడిని చంపేసి ముక్కలు చేయించాడు. మాంసం కోసేందుకు వినియోగించే పెద్ద సైజు కత్తి పీటలను ఇందుకోసం వాడారు . ఆ ముక్కలను 5 సంచుల్లో ప్యాక్ చేసి కేరళలోని వయనాడ్ పరిధిలో ఉన్న చాలియార్ నదిలో పడేశారు. దీనిపై దర్యాప్తు చేసిన కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ షైబిన్ అష్రాఫ్ తో పాటు హత్యలో పాల్గొన్న ఐదుగురు ముఠా సభ్యులను 2022 ఏప్రిల్ 30న అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న మరో 11 మందిపైనా కేసులు నమోదుచేశారు.

అసెంబ్లీ ముందు ఆ ముగ్గురి ఆత్మహత్యా యత్నంతో వెలుగులోకి..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2022 ఏప్రిల్ 28న ముగ్గురు వ్యక్తులు.. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అసెంబ్లీ ఎదుట నిలబడి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వాస్తవాలు చెప్పారు. మైసూరుకు చెందిన మూలికా వైద్యుడు షాబా షరీఫ్ హత్యలో తాము పాల్గొన్నామని చెప్పారు. దానికి సూత్రధారి కేరళకు చెందిన షైబిన్ అష్రాఫ్ అని వెల్లడించారు. షాబా షరీఫ్ ను హత్య చేసినందుకు ఇస్తానన్న మొత్తాన్ని ఇవ్వకుండా .. షైబిన్ అష్రాఫ్ తమను మోసగించాడని ఆరోపించారు. దీంతో తాము ఈఏడాది ఏప్రిల్ 24న అష్రాఫ్ ఇంటిలోదోపిడీకి పాల్పడ్డామని చెప్పారు. తమపై పోలీసు కేసు పెట్టించిన అష్రాఫ్ .. హత్య చేయించేందుకు కూడా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. షాబా షరీఫ్ దగ్గర ఉన్న రహస్య మూలికా వైద్య ఫార్ములా తీసుకొని క్లినిక్ ఏర్పాటు చేయాలని అష్రాఫ్ భావించాడని ఆ ముగ్గురు వివరించారు.

షాబా షరీఫ్ ఎలా మిస్సయ్యాడు..

2019 ఆగస్టు 2 న షాబా షరీఫ్ ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. తన బంధువు ఒకరు కామెర్లతో రక్తం కక్కుతున్నారని చెప్పాడు. సమీపంలోని లాడ్జీలో అతడు ఉన్నాడని, వెంటనే తనతో రావాలని విజ్ఞప్తి చేశాడు. సరేనన్న.. షాబా షరీఫ్ అతడితో బైక్ పై వెళ్ళాడు. రెండు రోజులైనా ఇంటికి రాలేదు. అటు నుంచి అటే ఏదైనా దర్గాను వెళ్లి ఉండొచ్చని భార్య, పిల్లలు భావించారు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు కిడ్నాప్ జరిగిన మూడేళ్ళ తర్వాత .. ఏం జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది.

Exit mobile version